పంజాబ్ ఆటగాళ్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోచ్!
పంజాబ్ కింగ్స్ తన తొలి పోరులో మార్చి 31న న్యూ చండీగఢ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
- Author : Gopichand
Date : 24-03-2026 - 3:26 IST
Published By : Hashtagu Telugu Desk
Ricky Ponting: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ తన సన్నాహాలను మొదలుపెట్టింది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లిన ఈ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇప్పటికే క్యాంప్‌లో చేరారు. వచ్చిన వెంటనే ఆయన ఆటగాళ్లకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. కేవలం నెట్స్‌లో సమయం గడపడం సరిపోదని, మొదటి మ్యాచ్‌కు ముందే శారీరక, సాంకేతిక, మానసిక అంశాల్లో పూర్తిగా సిద్ధంగా ఉండటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
పంజాబ్ కింగ్స్ తన తొలి పోరులో మార్చి 31న న్యూ చండీగఢ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్ల సందర్భంగా పాంటింగ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. ఇది కేవలం శిక్షణ కోసం మాత్రమే కాదని, మిమ్మల్ని మీరు సరైన దిశలో మలచుకోవడానికి దొరికిన సమయమని చెప్పారు. గత సీజన్లో జట్టు ఐక్యంగా ఉండి అద్భుత ప్రదర్శన చేసిందని, అదే తమ బలమని ఆయన గుర్తు చేశారు.
Also Read: Chiranjeevi – Baby Movie : చిరు చిత్రానికి సీనియర్ రైటర్ మాటలు ..కలిసొచ్చేనా ?
ప్రాసెస్ పై దృష్టి పెట్టాలని సూచన
క్రికెట్లో తప్పులు జరగడం సహజమని రికీ పాంటింగ్ ఆటగాళ్లకు వివరించారు. ఒక ప్లేయర్ క్యాచ్ వదలవచ్చు, చెత్త షాట్ ఆడవచ్చు లేదా బౌలర్ ఒక ఓవర్లో ఎక్కువ పరుగులు ఇవ్వవచ్చు.. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆటగాళ్లు తమ ప్రణాళిక, ప్రక్రియకు కట్టుబడి ఉండాలి. పాంటింగ్ అభిప్రాయం ప్రకారం.. ఆటగాళ్లు సరైన ఆలోచనతో, నిర్ణీత గేమ్ ప్లాన్‌తో ఆడుతూ తప్పులు చేస్తే అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అది ఆటలో భాగం. ఫలితాల ఒత్తిడి కంటే, తయారీ, సరైన పద్ధతిపై దృష్టి పెట్టాలని ఆయన నమ్ముతున్నారు. పెద్ద టోర్నమెంట్లలో ఇదే ప్రధాన మార్పును చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
గత సీజన్ చేదు జ్ఞాపకం.. ఈసారి టైటిల్ పై కన్ను
గత ఏడాది పంజాబ్ కింగ్స్ అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్లో కేవలం 6 పరుగుల తేడాతో టైటిల్‌కు దూరమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారిని ఓడించి తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఇప్పుడు పంజాబ్ ఆ నిరాశను వెనుకకు నెట్టి కొత్త ఆశలతో టోర్నీని ప్రారంభించే అవకాశం ఉంది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈసారి చాలా బలంగా కనిపిస్తోంది. జట్టులో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, లాకీ ఫెర్గూసన్, ప్రభ్సిమ్రాన్ సింగ్, నెహాల్ వధేరా వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.