Suryakumar Yadav : ఆస్ట్రేలియాపై రివేంజ్..టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ప్రత్యర్థిపై సూర్య రిప్లయ్!
- By Vamsi Chowdary Korata Published Date - 11:40 AM, Wed - 26 November 25
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెంటాడుతోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఆస్ట్రేలియానే ఎదుర్కోవాలని సూర్యకుమార్ యాదవ్ కోరుకుంటున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆ చేదు అనుభవం నుంచి కోలుకుని, ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ కూడా ఫైనల్లో భారత్ గెలవడమే ముఖ్యమని అన్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ప్రకటన సందర్భంగా సూర్య ఈ కామెంట్స్ చేశాడు.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌ను అటు ఫ్యాన్స్, ఇటు ప్లేయర్స్ ఎప్పటికీ మరచిపోలేరు. అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలయింది. ఆ రోజు తగలిన దెబ్బకు ప్రతి ఐసీసీ ఈవెంట్‌లోనూ భారత్ ప్రతీకారం తీర్చుకుంటూ వస్తోంది. అయితే ఆ గాయం ఇంకా పూర్తి స్థాయిలో నయం కాలేదని సూర్యకుమార్ యాదవ్ మాటలు వింటే స్పష్టంగా అర్థమవుతోంది.
టీ20 వరల్డ్ కప్ 2026కు ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. భారత్ – శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీ ఫుల్ డీటెయిల్స్‌ను ఐసీసీ ఛైర్మన్ జై షా అధికారింగా వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ని ఫైనల్‌లో ఎవర్నీ ఢీకొట్టాలని అనుకుంటున్నారని మీడియా ప్రశ్నించింది. దాంతో సూర్య తన మస్సులోని కోరికను బయటపెట్టాడు.
సూర్య కేవలం ఐదు పదాల్లోనే, తన మనస్సులో రగులుతున్న కార్చిచ్చును బయటపెట్టాడు. ‘అంటే.. అదే స్టేడియం, అదే జట్టు రివెంజ్ కోసం మళ్లీ ఆస్ట్రేలియానే!’ అని అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపాలయింది. ఆ మ్యాచ్‌లో సూర్య 28 బంతుల్లో కేవలం 18 పరుగులే చేసి పెద్దగా రాణించలేకపోయాడు. భారత్ 240 పరుగులే చేయగా, ఆస్ట్రేలియా సునాయాసంగా ఛేదించి వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుంది.
ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పక్కనే ఉన్న రోహిత్ శర్మ అందుకుని భారత్ ఫైనల్‌లో ఉండాలని చెప్పాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే పెద్ద విషయం కాదు, భారత్ ఫైనల్‌లో నిలిచి గెలవాలని చెప్పాడు. ‘నాకు ఒక్కటే ముఖ్యం, భారత్ ఫైనల్‌లో ఉండాలి. ప్రత్యర్థి జట్టు ఎవరు అనేది పెద్ద విషయం కాదు. మనం గెలవాలి అంతే’ అని రోహిత్ శర్మ చెప్పాడు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్‌ను జై షా ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంక వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లోని ఐదు వేదికలు, శ్రీలంకలోని 3 వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ – పాక్ రెండు జట్లూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది.