Virat-Rohit Retirement: విరాట్- రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వనున్నారా?
మెల్‌బోర్న్ టెస్టులో వ్యాఖ్యానిస్తూ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇంకా కొంతకాలం ఆడతాడని భావిస్తున్నాను. అతను మరో 3 లేదా 4 సంవత్సరాలు ఆడతాడని అనుకుంటున్నాను. రోహిత్ విషయానికొస్తే టెస్టుల్లో ఆడటం అనే నిర్ణయం అతనిదే.
- By Gopichand Published Date - 12:19 PM, Mon - 30 December 24

Virat-Rohit Retirement: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలవడానికి ఆస్ట్రేలియా భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత లక్ష్యాన్ని ఛేదించే సమయంలో టీమ్ ఇండియాకు శుభారంభం లభించలేదు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (Virat-Rohit Retirement) కూడా పెద్దగా రాణించలేకపోయారు. టెస్టు క్రికెట్‌లో రోహిత్, విరాట్‌లు వరుసగా నిరాశపరుస్తున్నారు. ఇది ఇప్పుడు వారిద్దరి భవిష్యత్తుకు కూడా ముప్పుగా పరిణమిస్తోంది. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు సంబంధించి టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పెద్ద ప్రకటన చేశాడు.
రిటైర్మెంట్ సమయం వచ్చిందా?
మెల్‌బోర్న్ టెస్టులో వ్యాఖ్యానిస్తూ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇంకా కొంతకాలం ఆడతాడని భావిస్తున్నాను. అతను మరో 3 లేదా 4 సంవత్సరాలు ఆడతాడని అనుకుంటున్నాను. రోహిత్ విషయానికొస్తే టెస్టుల్లో ఆడటం అనే నిర్ణయం అతనిదే. టాప్ ఆర్డర్‌లో అతని ఫుట్‌వర్క్ మునుపటిలా లేదు. చాలా సార్లు రోహిత్ బంతిని బీట్ చేయడంలో తడబడుతున్నాడు. కాబట్టి సిరీస్ ముగిశాక నిర్ణయం వారిదే అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
Also Read: AUS Beat IND: 155 పరుగులకే టీమిండియా ఆలౌట్.. ఆసీస్‌దే మెల్‌బోర్న్ టెస్టు!
సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన
ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులను, జట్టును నిరాశపరిచారు. పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ సెంచరీ సాధించినా.. ఆ తర్వాత ఒక్క మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. సెంచరీ తర్వాత ఈ సిరీస్‌లో కోహ్లీ 7, 11, 3, 36, 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు క్రీజులో నిలవడానికి రోహిత్ శర్మ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు రోహిత్ 3, 6, 10, 3, 9 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు టెస్టుల్లో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇకపోతే బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో ఆసీస్ గెలుపొంది 2-1తో ముందంజలో ఉంది. ఐదో, చివరి టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది.