Pakistan Hockey Team: భారత్‌కు మా జట్టును పంపేది లేదు.. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్‌కు పాక్ లేఖ!
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత "విషమ పరిస్థితులు" కారణంగా తమ జట్టును భారతదేశానికి పంపడం సురక్షితం కాదని తెలిపారు.
- Author : Gopichand
Date : 21-07-2025 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan Hockey Team: పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (PHF) భారతదేశంలో జరగనున్న ఆసియా కప్ 2025లో తమ జట్టును (Pakistan Hockey Team) పంపకూడదని నిర్ణయించుకుంది. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళనలు వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (FIH), ఆసియన్ హాకీ ఫెడరేషన్ (AHF)లకు PHF ఒక లేఖ రాసింది. భారతదేశంలో తమ ఆటగాళ్లకు ప్రమాదం ఉందని, భద్రత విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేమని పాకిస్తాన్ పేర్కొంది.
భారత-పాక్ సంబంధాలు, క్రీడలపై ప్రభావం
పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై జరిగిన దాడి తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. భారత ప్రభుత్వం నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ తర్వాత పాకిస్తాన్ తీవ్రంగా కలవరపడినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ రెండు దేశాలు క్రీడా రంగంలో కూడా ఆయా దేశాలను బహిష్కరించాలని ప్రకటించాయి.
Also Read: IND vs ENG: నాల్గవ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్!
ఇటీవల ఇంగ్లండ్‌లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్‌లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. జూలై 20న భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు ముందు చాలా మంది భారతీయ ఆటగాళ్లు పాకిస్తాన్‌తో ఆడటానికి నిరాకరించారు. దీని కారణంగా ఆ కీలక మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది క్రీడా అభిమానులను నిరాశపరిచింది.
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటన
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు తారిఖ్ బుగ్తీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ప్రస్తుత “విషమ పరిస్థితులు” కారణంగా తమ జట్టును భారతదేశానికి పంపడం సురక్షితం కాదని తెలిపారు. అందుకే తమ హాకీ జట్టు ఆసియా కప్ 2025లో పాల్గొనడానికి భారతదేశానికి వెళ్లడానికి ఇష్టపడటం లేదని FIH, AHFలకు తెలియజేశారు. ఈ ఏడాది ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్ ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. పాకిస్తాన్ నిర్ణయం ఈ క్రీడా సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తుంది.