Jasprit Bumrah: బుమ్రాను ట్రోల్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
కొంతమంది అభిమానులు బుమ్రాను ట్రోల్ చేసినప్పటికీ.. చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. బుమ్రా స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, అతని ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని మద్దతుదారులు వాదించారు.
- By Gopichand Published Date - 05:20 PM, Thu - 7 August 25

Jasprit Bumrah: భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ మొదటిసారి కెప్టెన్‌గా వ్యవహరించగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ విజయం తర్వాత ప్రపంచ నంబర్-1 టెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు తెచ్చిపెట్టింది. కొంతమంది అతన్ని ట్రోల్ చేయగా, మరికొందరు మద్దతుగా నిలిచారు.
బుమ్రా పోస్ట్, ట్రోలింగ్ కారణం
టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు. అందులో “అత్యంత పోటీతత్వం, ఉత్తేజకరమైన టెస్ట్ సిరీస్ నుండి మేము అద్భుతమైన జ్ఞాపకాలను తీసుకొచ్చాము! రాబోయే వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని రాశాడు. అయితే ఈ పోస్ట్‌లో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ లేదా ఇతర ఆటగాళ్ల పేర్లను బుమ్రా ప్రస్తావించలేదు. ఈ విషయంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బుమ్రాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒక యూజర్ “బుమ్రా సిరాజ్‌తో అసురక్షితంగా ఉన్నాడా?” అని ప్రశ్నించాడు. మరొక యూజర్ “జస్ప్రీత్ బుమ్రా ఈ పోస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది, సిరాజ్‌ను పొగడలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, గిల్ గురించి కూడా ఏమీ వ్రాయలేదు” అని కామెంట్ చేశాడు.
Also Read: NTR: ‘వార్ 2’లో డాన్స్‌తో అభిమానుల మనసు దోచుకున్న ఎన్టీఆర్!
సిరాజ్ అద్భుత ప్రదర్శన
ఐదవ చివరి టెస్ట్‌లో బుమ్రా మోకాలి గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని గైర్హాజరీలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఐదవ టెస్ట్‌లో ఏకంగా 9 వికెట్లు తీసి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ముఖ్యంగా చివరి రోజు 4 వికెట్లలో 3 తీసి, భారత్‌కు 6 పరుగుల తేడాతో విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ 2-2తో సమం కావడానికి సిరాజ్ ప్రదర్శనే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.
Bumrah after Siraj after
losing all matches winning
he played pic.twitter.com/ckxRSBGKd3— Dr Gill (@ikpsgill1) August 5, 2025
సిరాజ్ అవార్డు గెలుచుకున్న తర్వాత మాట్లాడుతూ.. బుమ్రా కూడా జట్టులో ఉంటే విజయం మరింత ఆనందంగా ఉండేదని చెప్పాడు. ఈ సిరీస్‌లో సిరాజ్ మొత్తం 5 టెస్ట్‌లలో 23 వికెట్లు తీసి, ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆశ్చర్యకరంగా బుమ్రా కూడా ఈ సిరీస్‌లో 23 వికెట్లు తీశాడు. కానీ అతను 3 మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు.
బుమ్రాకు మద్దతుగా అభిమానులు
కొంతమంది అభిమానులు బుమ్రాను ట్రోల్ చేసినప్పటికీ.. చాలామంది అతనికి మద్దతుగా నిలిచారు. బుమ్రా స్వతహాగా తక్కువ మాట్లాడే వ్యక్తి అని, అతని ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని మద్దతుదారులు వాదించారు. సిరాజ్ పేరును ప్రస్తావించకుండా శుభాకాంక్షల పోస్ట్ చేయడం, అన్ని మ్యాచ్‌లలో ఆడకపోవడంపై ట్రోల్ చేయడం మూర్ఖత్వం అని వారు అభిప్రాయపడ్డారు. బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు ఎన్నో కీలక మ్యాచ్‌లను గెలిపించాడని, అతను యాదృచ్ఛికంగా ప్రపంచ నంబర్ 1 టెస్ట్ బౌలర్‌గా నిలవలేదని గుర్తు చేశారు.