Women’s T20 World Cup: మహిళల టీ 20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్
సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది.
- By Naresh Kumar Published Date - 10:30 AM, Tue - 21 February 23

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ (T20 World Cup) లో భారత్ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో భారత్ 5 రన్స్ తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధానా 87 పరుగులు చేసింది. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ భారీ షాట్లతో విరుచుకు పడింది. మందాన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు , 3 సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ కు షెఫాలీ వర్మతో కలిసి 62 పరుగులు జోడించింది.షెఫాలీ వర్మ 24, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 13 పరుగులు చేశారు. చివర్లో జెమీమా 12 బంతుల్లో 19 పరుగులు చేసింది.
తర్వాత చేజింగ్ లో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది.తొలి బంతికే ఐర్లాండ్ ఓపెనర్ అమీ హంటర్ (1) రనౌట్ అయింది. అదే ఓవర్ ఐదో బంతికి ఓర్లా ప్రెండెర్‌గాస్ట్ (0) కూడా అవుటైంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో గాబీ లూయిస్, కెప్టెన్ లారా డెలానీ మూడో వికెట్ కు 52 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు చేసిన సమయంలో భారీ వర్షం కురిసింది. తర్వాత మళ్లీ మ్యాచ్ సాధ్యం కాలేదు. అప్పటికి ఐర్లాండ్ డీఎల్ఎస్ స్కోరు కంటే 5 పరుగులు వెనుకబడి ఉంది. తిరిగి మ్యాచ్ ప్రారంభం కాకపోవడంతో అదే 5 పరుగుల తేడాతో భారత్ గెలిచినట్టు ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) లో భారత్ సెమీస్ కు చేరడం ఇది మూడోసారి. 2018, 2020లలోనూ ఈ మెగా టోర్నీ లో భారత్ సెమీస్ కు చేరింది. 2020లో రన్నరప్ గా నిలిచింది. ఇదిలా ఉంటే సెమీస్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడే అవకాశం ఉంది.
Also Read: US: జో బిడెన్ ఉక్రెయిన్ పర్యటనను అమెరికా ఎలా రహస్యంగా ఉంచింది?