IND vs SA: మూడో టీ20లో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం!
118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు.
- Author : Gopichand
Date : 14-12-2025 - 10:39 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs SA: భారత్- దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య 5 మ్యాచ్‌ల T20I సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో భాగంగా మూడో T20 మ్యాచ్ ధర్మశాలలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ విజయం సాధించింది. భారత జట్టు ముందుగా బౌలింగ్‌లో తమ సత్తా చూపగా.. ఆ తర్వాత అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
దక్షిణాఫ్రికా 117 పరుగులకే పరిమితం
ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆఫ్రికా తరఫున ఓపెనర్ క్వింటన్ డి కాక్ 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేయగా, రీజా హెండ్రిక్స్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే ఐడెన్ మార్కరమ్ 46 బంతుల్లో 61 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసింది అతనే. దీంతో పాటు డొనోవన్ ఫెరీరా 15 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి కూడా చెరో 2 వికెట్లు పడగొట్టగా, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాకు చెరో 1 వికెట్ లభించింది.
Also Read: LPG Price: ఏ దేశంలో గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసా?!
భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది
118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టు సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టుకు దూకుడుగా శుభారంభం ఇచ్చాడు. అతను 18 బంతుల్లో 35 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లతో పాటు 3 సిక్సర్లు కొట్టాడు. శుభమన్ గిల్ 23 బంతుల్లో 28 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో 12 పరుగులు చేశాడు. దీంతో పాటు తిలక్ వర్మ 34 బంతుల్లో 25 పరుగులు చేసి రాణించాడు. భారత్ 15.5 ఓవర్లలో 120/3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.