Mohsin Naqvi Apologizes: భారత్‌కు క్షమాపణలు చెప్పిన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ!
పాకిస్థాన్ వైపు నుండి కూడా నఖ్వీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నఖ్వీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని అన్నారు. నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఉండటంతో పాటు పాకిస్థాన్ హోం మంత్రిగా కూడా ఉన్నారు.
- By Gopichand Published Date - 03:57 PM, Wed - 1 October 25

Mohsin Naqvi Apologizes: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ భారత్‌కు క్షమాపణలు (Mohsin Naqvi Apologizes) చెప్పారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మనం ఇప్పుడు కొత్తగా ప్రారంభించాలి” అని అన్నారు. ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించాక నఖ్వీ ట్రోఫీని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయారు. అప్పటివరకు మొండిగా వ్యవహరించిన నఖ్వీ.. ఇప్పుడు మెత్తబడ్డారు. ట్రోఫీని తిరిగి ఇచ్చే విషయంపై కూడా ఆయన స్పందించారు.
సూర్యకుమార్ యాదవ్ వచ్చి ట్రోఫీ తీసుకెళ్లాలి
దుబాయ్‌లో మంగళవారం (సెప్టెంబర్ 30) జరిగిన ACC సమావేశంలో BCCI ఈ ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని లేవనెత్తింది. దీని తర్వాత నఖ్వీ క్షమాపణలు చెప్పారు. నఖ్వీ ACC సమావేశంలో మాట్లాడుతూ.. “ఏం జరిగిందో అది జరగాల్సింది కాదు. కానీ ఇప్పుడు మనం కొత్త చొరవ తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వచ్చి ట్రోఫీని తీసుకెళ్లాలి” అని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన తర్వాత నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించారు. నఖ్వీ చాలాసేపు వేచి చూసినా టీమ్ ఇండియా ఆటగాళ్లు అంగీకరించలేదు. దీంతో నఖ్వీ ట్రోఫీ, మెడల్స్ రెండింటినీ తనతో పాటు తీసుకుని వెళ్లిపోయారు.
Also Read: Cough Syrup: దగ్గు మందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి.. ఎక్కడంటే?
నఖ్వీ రాజీనామాకు పాకిస్థాన్‌లో డిమాండ్
పాకిస్థాన్ వైపు నుండి కూడా నఖ్వీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది నఖ్వీని వ్యతిరేకిస్తూ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని అన్నారు. నఖ్వీ పీసీబీ చీఫ్‌గా ఉండటంతో పాటు పాకిస్థాన్ హోం మంత్రిగా కూడా ఉన్నారు. ‘టెలికాం ఆసియా స్పోర్ట్’ ప్రకారం.. “నఖ్వీ ఒక పదవికి రాజీనామా చేయాలి. పాకిస్థాన్ క్రికెట్‌పై ఈ సమయంలో దృష్టి పెట్టడం చాలా అవసరం” అని అఫ్రిది అన్నారు.
కీర్తి ఆజాద్ ఏమన్నారు?
మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ ఈ విషయంపై స్పందిస్తూ “ఆయన క్షమాపణలు అడుగుతున్నారా లేదా అనేది వేరే విషయం. ట్రోఫీ ఆయన వ్యక్తిగత ఆస్తి కాదు, ఆయన దాన్ని ఎలా తీసుకుని వెళ్లిపోయారు. ఇది ఎలా ఉందంటే.. అవుట్ అయ్యాక బ్యాట్, బాల్ తీసుకుని వెళ్లిపోయినట్లు ఉంది” అని వ్యాఖ్యానించారు.