Rishabh Pant: బాధలో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. కారణమిదే?
రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి తిరిగి వస్తారో చెప్పడం చాలా కష్టం. యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం పంత్‌ను భారత జట్టులోకి తీసుకోలేదు.
- By Gopichand Published Date - 05:25 PM, Sun - 31 August 25

Rishabh Pant: టీం ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) తీవ్ర బాధలో ఉన్నారు. తన బాధను తెలియజేస్తూ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోను పంచుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో పంత్ తీవ్రంగా గాయపడటం వలన సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం పంత్ గాయం నుంచి కోలుకుంటున్నారు. తన గాయం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. గాయం కారణంగా పంత్ ఆసియా కప్ 2025లో జట్టులో భాగం కాలేదు. దీనితో పాటు వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో కూడా పంత్ ఆడటం కష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ జరుగుతున్న సమయంలో పంత్ కాలికి గాయమైన సంగతి తెలిసిందే.
పంత్ బాధపడటానికి కారణం ఏంటి?
రిషబ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీ షేర్ చేశారు. ఆ స్టోరీలో పంత్ తన గాయపడిన కాలిని చూపిస్తూ ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి “ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉండాలి” అని రాశారు. దీనితో పాటు ఒక బాధపడే ఎమోజీని కూడా పెట్టారు.
Also Read: T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్‌లైన్ కోచింగ్!
Instagram story of Rishabh Pant – Get well soon Spidey 🕷️ pic.twitter.com/SIcdbtOdYB
— Johns. (@CricCrazyJohns) August 31, 2025
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్రిస్ వోక్స్ వేసిన ఒక బంతి పంత్ కుడి కాలి వేలికి తగిలింది. ఆ తర్వాత ఆయన చాలా నొప్పిగా కనిపించారు. పంత్ సరిగ్గా నిలబడలేకపోయారు. దీంతో అతడిని కారులో మైదానం నుండి బయటకు తీసుకెళ్లారు. స్కానింగ్ తర్వాత పంత్ కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. దీని కారణంగా అతను సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఈ సిరీస్‌లో భారత్ జట్టు 2-2తో ఇంగ్లాండ్‌తో సమంగా నిలిచింది.
పంత్ ఎప్పుడు తిరిగి వస్తారు?
రిషబ్ పంత్ ఎప్పుడు మైదానంలోకి తిరిగి వస్తారో చెప్పడం చాలా కష్టం. యూఏఈలో జరగనున్న ఆసియా కప్ 2025 కోసం పంత్‌ను భారత జట్టులోకి తీసుకోలేదు. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా పంత్ కనిపించకపోవచ్చని భావిస్తున్నారు.