T-SAT: బ్యాంక్ ఉద్యోగాలకు టీ-సాట్ నుండి ప్రత్యేక ఆన్‌లైన్ కోచింగ్!
టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ఆధ్వర్యంలో మొత్తం 10,227 పోస్టులు భర్తీ చేయనున్నారు.
- By Gopichand Published Date - 05:15 PM, Sun - 31 August 25

T-SAT: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. టీ-సాట్ (T-SAT) నెట్‌వర్క్ ఛానెళ్లు దేశవ్యాప్తంగా నిర్వహించే బ్యాంకింగ్ పోటీ పరీక్షల కోసం ప్రత్యేక డిజిటల్ కోచింగ్‌ను అందిస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 3 వరకు 35 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో నిపుణ, విద్య ఛానెళ్లలో ఈ ప్రత్యేక ప్రసారాలు జరగనున్నాయి.
ఈ విషయాన్ని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఐబిపిఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్) ఆధ్వర్యంలో మొత్తం 10,227 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో తెలంగాణకు 261, ఆంధ్రప్రదేశ్‌కు 367 పోస్టులు కేటాయించబడ్డాయి. జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల యువత మంచి స్థానం సాధించాలనే లక్ష్యంతోనే టీ-సాట్ ఈ కోచింగ్‌ను తెలుగు, ఆంగ్ల భాషల్లో అందిస్తున్నట్లు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, పజిల్స్, పారా జంబుల్స్ వంటి ముఖ్యమైన సబ్జెక్టులపై ఈ డిజిటల్ ప్రసారాలు ఉంటాయని ఆయన వివరించారు.
షెడ్యూల్ వివరాలు
సెప్టెంబర్ 1 నుండి నిపుణ ఛానెల్‌లో సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు, విద్య ఛానెల్‌లో ఉదయం 7 నుండి 9 గంటల వరకు డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారమవుతాయి. ఈ ప్రసారాలు అక్టోబర్ 3వ తేదీ వరకు మొత్తం 35 రోజులు, 100 ఎపిసోడ్‌లలో కొనసాగుతాయి.
Also Read: Modi Meets Xi: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదం.. పరిష్కారానికి తొలి అడుగు!
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎన్.ఎం.ఎం.ఎస్. కోసం ప్రత్యేక శిక్షణ
ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం టీ-సాట్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎం.హెచ్.ఆర్.డి (మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్) ఆధ్వర్యంలో నవంబర్ లేదా డిసెంబర్‌లో నిర్వహించే ఎన్.ఎం.ఎం.ఎస్ (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్) అర్హత పరీక్ష కోసం విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తోంది.
ఈ కోచింగ్ సెప్టెంబర్ 1 నుండి విద్య ఛానెల్‌లో ఉదయం 11 నుండి 12 గంటల వరకు ప్రసారమవుతుంది. ఇందులో అరగంట నిడివి గల రెండు పాఠ్యాంశాలు ఉంటాయి. మొత్తం 100 ఎపిసోడ్‌ల ప్రసారాలు డిసెంబర్‌లో పరీక్షలు జరిగే వరకు కొనసాగుతాయి. మ్యాట్ (MAT), శాట్ (SAT) వంటి ప్రధాన సబ్జెక్టులపై ఈ డిజిటల్ పాఠాలు ఉంటాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఉపకారవేతనాలకు అర్హత సాధించాలని వేణుగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.