T20 World Cup: టీమిండియా ఫిట్‌నెస్‌పై హెడ్ కోచ్ గంభీర్ ఆందోళన!
బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ తదుపరి లక్ష్యాలను స్పష్టం చేశారు.
- By Gopichand Published Date - 05:29 PM, Tue - 11 November 25
T20 World Cup: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు ఫిట్‌నెస్ స్థాయిపై ఆందోళన వ్యక్తం చేశారు. 2026లో స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup)కు ఇంకా కొన్ని నెలలే మిగిలి ఉన్నప్పటికీ.. జట్టు ఉండవలసిన ఫిట్‌నెస్ ప్రమాణాలకు ఇంకా చేరుకోలేదని సోమవారం స్పష్టం చేశారు. ఆటగాళ్లతో మాట్లాడినట్లు తెలిపిన గంభీర్.. ఒక పెద్ద టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున ప్రతి అంశం పర్ఫెక్ట్‌గా ఉండాలని నొక్కి చెప్పారు.
ఆస్ట్రేలియా సిరీస్ విజయం తర్వాత కీలక వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న (చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది) కొద్ది గంటలకే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన కోచింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోలేదు. అయితే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ప్రధాన ఆటగాళ్లు యాషెస్ సిరీస్ సన్నాహాల కారణంగా ఆడలేదని ఆయన గుర్తు చేశారు.
Also Read: Investment In AP: వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు- సీఎం చంద్రబాబు
తక్షణ లక్ష్యం టెస్ట్ మ్యాచ్‌లే
బీసీసీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. టీమ్ తదుపరి లక్ష్యాలను స్పష్టం చేశారు. “మా తక్షణ దృష్టి అంతా సౌత్ ఆఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లపైనే ఉంది. ఇవి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన కీలకమైన మ్యాచ్‌లు. టెస్ట్ సైకిల్ ప్రాముఖ్యత మాకు తెలుసు. కాబట్టి ఈ రెండు మ్యాచ్‌లు అత్యంత ముఖ్యం” అని ఆయన అన్నారు.
టీ20 వరల్డ్ కప్ సన్నద్ధతకు ఫిట్‌నెసే కీలకం
టెస్ట్ సిరీస్ తర్వాత ప్రధాన లక్ష్యం స్వదేశంలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ అని గంభీర్ తెలిపారు. “నా దృష్టిలో టెస్ట్, టీ20 ఫార్మాట్‌లు ముఖ్యమైనవి. 50 ఓవర్ల ఫార్మాట్‌ను నిర్లక్ష్యం చేయడం లేదు. కానీ ఫిట్‌నెస్ కోణం నుండి చూస్తే మేము టీ20 వరల్డ్ కప్‌కు సిద్ధంగా ఉండాల్సిన స్థాయికి ఇంకా చేరుకోలేదు” అని గంభీర్ పేర్కొన్నారు.
ఆటగాళ్లలో ఫిట్‌నెస్ అవగాహన గురించి ఆయన మాట్లాడుతూ.. “మనం ఖచ్చితంగా చురుకుగా ఉండాలి. ఫిట్‌గా ఉండాలి, వేగంగా పరిగెత్తాలి. మెరుగైన ఫిట్‌నెస్ ఉంటే, మానసికంగా కూడా బలంగా ఉంటారు. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో శరీరం దృఢంగా ఉంటే మెదడు కూడా స్థిరంగా ఉంటుంది. ఆటగాళ్లు ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా మూడు నెలల సమయం ఉంది. మేము తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటాం” అని ఆశాభావం వ్యక్తం చేశారు.