Gautam Gambhir : టీమిండియా ఏం చేస్తుందో తెలీటం లేదు..? ఆస్ట్రేలియా కెప్టెన్ సూటి ప్రశ్న!
- By Vamsi Chowdary Korata Published Date - 12:11 PM, Wed - 19 November 25
భారత జట్టు స్వదేశంలో టెస్టుల్లో ఆధిపత్యాన్ని కోల్పోవడం, పిచ్‌ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో తీవ్ర టర్నింగ్ పిచ్‌లపై ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని ప్రశ్నించారు. సొంత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్న ఇలాంటి పిచ్‌లతో భారత్ తమకే నష్టం చేసుకుంటుందని, ఫ్లాట్ పిచ్‌లు సిద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాలుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌తో సిరీస్ సమయంలో కూడా ఇలానే ఓటమి పాలయిందని గుర్తు చేశారు.
భారత జట్టు గత ఏడాది కాలం నుంచి స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఆధిపత్యాన్ని నెమ్మదిగా కోల్పోతుంది. ముఖ్యంగా పిచ్ తయారీలో తీసుకుంటున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలకు గురవుతోంది. భారత్‌కు కంచుకోటలా ఉండే హోం పిచ్‌లు ఇప్పుడు సందర్శక జట్లకు తలుపులు తెరిచేలా మారిపోతున్నాయి. మొదటి రోజు నుంచే టర్న్ అయ్యేలా సిద్ధం చేస్తున్న ఈడెన్ గార్డెన్స్ లాంటి పిచ్‌లు ప్రత్యర్థులకు సవాళ్లుగానే కాకుండా, భారత్ ఓటమిలోనూ భాగమవుతున్నాయి.
సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్ట్‌లో భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ భారత వ్యూహాన్ని బహిరంగంగా ప్రశ్నించారు. భారత్ ఇలాంటి తీవ్రమైన టర్నింగ్ పిచ్‌లను ఎందుకు సిద్ధం చేస్తోంది, వాటిని సొంత బ్యాటర్లు కూడా ఎదుర్కోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
విల్లో టాక్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో హీలీ మాట్లాడుతూ భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు తనకు అర్థం కావడం లేదన్నారు. నేటి క్రికెట్‌లో ఎక్కడైనా స్పిన్‌కు ఎదురు నిలవడం కష్టమైపోయిందని, అలాంటి పరిస్థితుల్లో భారత్ ఇలాంటి పిచ్‌లను సిద్ధం చేసి తమకే నష్టం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
తీవ్ర టర్నింగ్ పిచ్‌లపై గత సంవత్సరం న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టుల్లో కూడా భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని హీలీ గుర్తు చేశారు. ఫ్లాట్ పిచ్‌లు సిద్ధం చేస్తే భారత్ తరచూ ఎదుర్కొంటున్న ఓటములను నివారించగలదని ఆమె సూచించారు.
వాళ్లకు వాళ్లే ఇబ్బందులు ఎందుకు తెచ్చుకుంటున్నారో నాకర్థం కావట్లేదు. స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కష్టమైన విషయమే. చిన్నప్పటి నుంచి అలాంటి పిచ్‌లపై ఆడినా కూడా ఇది సులభం కాదు. భారత్ ఇలాగే టర్నింగ్ పిచ్‌లను తయారు చేస్తూనే ఉంది.. కానీ వాటి వల్ల లాభం ఏమీ లేకపోయింది. న్యూజిలాండ్ కూడా ఇలాగే వారిని ఓడించింది. కాబట్టి ఫ్లాట్ వికెట్లను సిద్ధం చేయడమే మంచిది అని హీలీ వ్యాఖ్యానించారు.
జడేజా, కుల్దీప్, వాషింగ్టన్, అక్షర్ వీరంతా స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేస్తేనే ప్రమాదకరంగా ఉంటారు. పిచ్ ఎక్కువగా తిరిగితే వాళ్ల సహజ శైలి దెబ్బతింటుంది. అంతేకాదు, ఇలాంటి పిచ్‌లు ప్రత్యర్థి బౌలర్లను కూడా ఆటలోకి తీసుకువస్తాయి. ఇలాంటి పిచ్‌ల కారణంగానే భారత్ స్వదేశంలో టెస్టులు కోల్పోవడం వింతైన పరిస్థితి అని ఆమె చెప్పారు.