Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్ కోసమే బ్రాంకో టెస్ట్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
ఇటీవల తరచుగా వినిపిస్తున్న 'బ్రాంకో టెస్ట్' అంటే ఏమిటి? బ్రాంకో టెస్ట్ అనేది పరుగుల ఆధారంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తుంది. ఇది ఆటగాళ్ల స్టామినా, మానసిక బలం, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
- By Gopichand Published Date - 10:37 PM, Mon - 25 August 25

Rohit Sharma: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ఇటీవల ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరీక్షించడానికి బ్రాంకో టెస్ట్ (Bronco Test) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ల కోసం ఈ పరీక్షను తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడం, స్టామినాను పెంచడం. అయితే దీనిపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఆశ్చర్యకరమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కొత్త టెస్ట్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్వయంగా ODI క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేలా చేయడానికే తీసుకువచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు.
క్రికెట్ ట్రాకర్‌తో మాట్లాడిన మనోజ్ తివారీ.. “రోహిత్ శర్మను ఎవరూ అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్లలో ఒకరిగా భావించరు. కానీ అతని ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. అందుకే ఎవరూ అతన్ని బెంచ్‌పై కూర్చోబెట్టలేరు” అని అన్నారు.
Also Read: Avneet Kaur: విరాట్ కోహ్లీ లైక్ వివాదంపై స్పందించిన అవనీత్ కౌర్!
మనోజ్ తివారీ మాట్లాడుతూ.. “2027 ODI ప్రపంచ కప్ ప్రణాళికల నుండి విరాట్ కోహ్లీని తప్పించడం చాలా కష్టం అని నేను అనుకుంటున్నాను. అయితే, రోహిత్ శర్మ ప్రపంచ కప్ ప్రణాళికలో ఉంటాడా అనేది నాకు సందేహంగా ఉంది. భారత క్రికెట్‌లో జరుగుతున్న విషయాలను నేను నిశితంగా పరిశీలిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం తీసుకువచ్చిన ఈ బ్రాంకో టెస్ట్ ఉద్దేశ్యం నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్ శర్మ లేదా అతని లాంటి ఆటగాళ్లు తమ కెరీర్‌ను కొనసాగించకుండా ఆపడమే. రోహిత్ భవిష్యత్తులో జట్టులో ఉండకూడదని ఎవరో కోరుకుంటున్నారు? అందుకే ఈ బ్రాంకో టెస్ట్‌ను తీసుకువచ్చారు” అని చెప్పారు. ఈ బ్రాంకో టెస్ట్‌ను ఎవరు తీసుకువచ్చారో తనకు తెలియదని మనోజ్ తివారీ స్పష్టం చేశారు. అయితే తన దృష్టిలో రోహిత్ శర్మకు ఈ ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టమైన పని అని అన్నారు.
బ్రాంకో టెస్ట్ అంటే ఏమిటి?
ఇటీవల తరచుగా వినిపిస్తున్న ‘బ్రాంకో టెస్ట్’ అంటే ఏమిటి? బ్రాంకో టెస్ట్ అనేది పరుగుల ఆధారంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తుంది. ఇది ఆటగాళ్ల స్టామినా, మానసిక బలం, హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యో-యో టెస్ట్‌లో లాగా కాకుండా ఆటగాళ్లకు మధ్యలో ఎటువంటి విరామం ఉండదు. ఇందులో 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల షటిల్ రన్స్ ఉంటాయి. ఆటగాళ్లు మొత్తం 1200 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ ప్రక్రియ అనేక సెట్లలో జరుగుతుంది.