టీ20 వరల్డ్ కప్.. ఆటగాళ్లకు బీసీసీఐ కీలక నిబంధనలు!
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒక మ్యాచ్ ఇప్పటికే ముగిసింది.
- Author : Gopichand
Date : 10-02-2026 - 5:14 IST
Published By : Hashtagu Telugu Desk
BCCI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి తన మార్గదర్శకాలను స్పష్టం చేసింది. ఇది టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఒక రకంగా షాక్ ఇచ్చింది. నిజానికి టీ20 వరల్డ్ కప్ సమయంలో ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించవచ్చా? వారితో కలిసి ఉండవచ్చా అని భారత టీమ్ మేనేజ్మెంట్ బోర్డును కోరింది. కానీ BCCI ఈ అభ్యర్థనను స్పష్టంగా తోసిపుచ్చింది.
ఆటగాళ్లు తమ కుటుంబాలను ఎప్పుడు? ఎంత కాలం పాటు తమతో ఉంచుకోవచ్చనే దానిపై BCCIకి ఇప్పటికే ఒక పాలసీ ఉంది. ఈ నిబంధన ప్రకారమే టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉండటానికి బోర్డు అనుమతి ఇవ్వలేదు.
టీమ్ మేనేజ్మెంట్ కోరిన వివరాలు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆటగాళ్ల భార్యలు, పార్ట్నర్లు, పిల్లలను తమతో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని భారత టీమ్ మేనేజ్మెంట్ BCCIని కోరింది. అయితే BCCI దీనిపై పూర్తి నిషేధం విధించనప్పటికీ, ఒక నిర్ణీత సమయాన్ని నిబంధనగా పెట్టింది. బోర్డు పాలసీ ప్రకారం.. ఏదైనా విదేశీ పర్యటన 45 రోజుల కంటే ఎక్కువ ఉంటేనే, ఆటగాళ్లు తమ కుటుంబాన్ని గరిష్టంగా 14 రోజుల పాటు తమతో ఉంచుకోవచ్చు. ఈ టీ20 వరల్డ్ కప్ భారత్‌లో జరుగుతుండటం, ఇది సుమారు నెల రోజుల టోర్నమెంట్ మాత్రమే కావడంతో ఈ అభ్యర్థనను బోర్డు తిరస్కరించింది.
Also Read: వైవీ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనా ?
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఒక BCCI ప్రతినిధి మాట్లాడుతూ ఇలా అన్నారు. “భార్యలు లేదా కాబోయే భార్యలు టీమ్‌తో కలిసి ప్రయాణించవచ్చా? వారితో ఉండవచ్చా అని టీమ్ మేనేజ్మెంట్ అడిగింది. దీనికి బోర్డు స్పందిస్తూ కుటుంబ సభ్యులు ఆటగాళ్లతో కలిసి ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే వారు కోరుకుంటే వారి సొంతంగా విడి ఏర్పాట్లు చేసుకోవచ్చు” అని పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా అనుమతి లేదు
గతేడాది ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కోసం BCCI ఈ మార్గదర్శకాలను రూపొందించింది. బోర్డు ఇప్పటికీ వాటికే కట్టుబడి ఉంది. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా ఆటగాళ్లకు కుటుంబ సభ్యులను వెంట ఉంచుకునేందుకు అనుమతి లభించలేదు.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఒక మ్యాచ్ ఇప్పటికే ముగిసింది. ఒక మ్యాచ్ కొలంబోలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు భారత్‌లోనే జరుగుతాయి. ఆ తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. భారత జట్టు టోర్నమెంట్ మొత్తం ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లలో ప్రయాణిస్తుంది. కొందరు ఆటగాళ్ల వ్యక్తిగత చెఫ్‌లు కూడా వెంట ఉన్నారు. కానీ వారు జట్టు ఉండే హోటల్లో కాకుండా వేరే హోటళ్లలో బస చేస్తున్నారు.