Bat At No.4: ఓపెనర్లు వారే.. మరి నాలుగులో ఎవరు..?
గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య నాలుగో స్థానం (Bat At No.4). కీలక ఆటగాళ్ళు గాయాల బారిన పడడంతో ఈ ప్లేస్‌లో ఎవరిని దించాలనే దానిపై కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జనభర్జన పడుతున్నారు.
- By Naresh Kumar Published Date - 06:28 AM, Wed - 30 August 23

Bat At No.4: వరల్డ్‌కప్ కంటే ముందు టీమిండియాకు ఎదురుకానున్న పరీక్ష ఆసియాకప్ (Asia Cup 2023).. జట్టు కూర్పును పరిశీలించుకునేందుకు మంచి అవకాశం ఈ టోర్నీనే.. ఇప్పటి వరకూ కొన్ని స్థానాలపై భారత్ మేనేజ్‌మెంట్‌కు క్లారిటీ లేదు. గత కొంతకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య నాలుగో స్థానం (Bat At No.4). కీలక ఆటగాళ్ళు గాయాల బారిన పడడంతో ఈ ప్లేస్‌లో ఎవరిని దించాలనే దానిపై కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో మిగిలిన ఆప్షన్ శ్రేయాస్ అయ్యర్.. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని ద్రావిడ్ స్పష్టం చేసిన నేపథ్యంలో నాలుగులో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది.
వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఆసియాకప్‌లో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో కుదురుకుంటే అంతకంటే సానుకూలాంశం ఇంకోటి లేదనే చెప్పాలి. ఎందుకంటే తుది జట్టు కాంబినేషన్‌ను చూసుకుంటే ఓపెనర్లుగా రోహిత్‌శర్మకు తోడు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లో ఒకరు ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషసన్ కావాలనుకుంటే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా వస్తాడు. ఒకవేళ గిల్‌ను ఓపెనర్‌గా తీసుకుంటే వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కొచ్చు. కెఎల్ రాహుల్ ఫిట్‌నెస్ సాధించకపోవడంతో తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తేలిపోయింది. ఇక మూడో స్థానంలో కోహ్లీ దిగనుండగా..ఐదో స్థానంలో హార్థిక్ పాండ్య, తర్వాత రవీంద్ర జడేజా ఆడనున్నారు.
Also Read: Asia Cup Records: ఆసియా కప్ ట్రాక్ రికార్డ్స్
ఇదిలా ఉంటే బౌలింగ్ కాంబినేషన్‌కు సంబంధించి బూమ్రా ఎంట్రీ టీమ్‌కు మేజర్ అడ్వాంటేజ్.. దాదాపు 10 నెలల పాటు ఆటకు దూరమైన బూమ్రా ఇటీవల ఐర్లాండ్‌తో సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. బూమ్రాకు అసలు సవాల్ మాత్రం ఆసియాకప్‌లోనే ఎదురుకానుంది. అలాగే షమీ, సిరాజ్ పేస్ ద్వయంతో పాటు స్పిన్ విభాగంలో జడేజా,అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నారు. ఉపఖండపు పిచ్‌లు కావడంతో స్పిన్నర్లే కీలకం. మొత్తం మీద తుది జట్టు కూర్పు మరోసారి భారత్ మేనేజ్‌మెంట్‌కు సవాల్ కానుంది.
అయితే మితిమీరిన ప్రయోగాల కంటే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకునే వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోనుంది. ఆసియాకప్‌లో జట్టు కూర్పుపై స్పష్టత రాకుంటే టీమిండియాకు కష్టమే. సొంతగడ్డపై జరగనున్న ప్రపంచకప్‌ను గెలవాలని పట్టుదలగా ఉన్న రోహిత్‌సేనకు టోర్నీ ఆరంభానికి ముందే కూర్పుపై కీలక నిర్ణయాలు తీసుకోకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదు. ఎందుకంటే టీ ట్వంటీ ఫార్మాట్‌తో పోలిస్తే వన్డేల్లో బ్యాటింగ్ పరంగా భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. భారీస్కోరు చేయాలన్నా.. భారీ టార్గెట్ ఛేదించాలన్న పార్టనర్‌షిప్స్ కీలకం. టీ ట్వంటీ తరహాలో హిట్టింగ్ మోడ్ ఆడేద్దామంటే కుదరదు. అందుకే జట్టు కూర్పు ఈ భాగస్వామ్యాలకు కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌తో ఎట్టిపరిస్థితుల్లో దాదాపు అన్ని స్థానాలపైనా స్పష్టత వచ్చేలా చూసేందుకు కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ పట్టుదలగా ఉన్నారు.