అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీం రిలీఫ్.. 9 ఏళ్ల తర్వాత బీసీసీఐ వ్యవహారాల్లోకి తిరిగి ప్రవేశం!
ఫిబ్రవరి 5న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌కు పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
- Author : Gopichand
Date : 05-02-2026 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Anurag Thakur: ఫిబ్రవరి 5న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌కు పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. 2017లో బీసీసీఐ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోర్టు ఆదేశించగా, ఇప్పుడు ఆయన మళ్లీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమం అయ్యింది.
9 ఏళ్ల తర్వాత దక్కిన ఊరట
దాదాపు 9 ఏళ్ల తర్వాత అనురాగ్ ఠాకూర్‌కు ఈ ఊరట లభించింది. జనవరి 2017లో బీసీసీఐ కార్యకలాపాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని కోర్టు ఆయనను ఆదేశించింది. ఆ సమయంలో ఠాకూర్ షరతులేని క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఆయనను బీసీసీఐలో పాల్గొనేందుకు స్వేచ్ఛనిచ్చింది. తను క్రికెట్ బోర్డు వ్యవహారాలకు దూరంగా ఉండాలన్న పాత ఆదేశాలను సవరించాలని కోరుతూ అనురాగ్ ఠాకూర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: BSNL సరికొత్త ఆఫర్ ! అతి తక్కువ రీఛార్జ్ తో రోజుకు 2.6 జీబీ డేటా తో ఏడాది అంత మాట్లాడొచ్చు !!
ఠాకూర్ వాదన
కోర్టులో ఠాకూర్ తన వాదనను వినిపిస్తూ.. నా వాదన వినకుండానే ఆ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఆ తర్వాత కోర్టు నాపై ఉన్న కోర్టు ధిక్కరణ, తప్పుడు సాక్ష్యం కేసులను ముగించింది. కాబట్టి ఇప్పుడు ఆ పాత ఆదేశాలను సవరించాలని నేను ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం ఏమన్నది?
అనురాగ్ ఠాకూర్ కేసుపై ధర్మాసనం స్పందిస్తూ ఇలా వ్యాఖ్యానించింది. శిక్ష, తప్పుల మధ్య సమతుల్యత ఉండాలని మేము భావిస్తున్నాము. ఆయనపై జీవితకాల నిషేధం విధించడం కోర్టు ఉద్దేశ్యం కాదు. దాని అవసరం కూడా లేదు. అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే షరతులేని క్షమాపణలు చెప్పారు. కోర్టు దానిని ఆమోదించింది. కాబట్టి, మేము జనవరి 2, 2017 నాటి పాత ఆదేశాలను సవరించున్నాము. ఇకపై అనురాగ్ సింగ్ ఠాకూర్ నిబంధనల ప్రకారం బీసీసీఐ కార్యకలాపాల్లో మళ్లీ పాల్గొనవచ్చు అని పేర్కొంది.