Asian Games : ఆసియా క్రీడల్లో భారత్ బోణీ.. షూటింగ్, రోయింగ్, మహిళల క్రికెట్‌లో పతకాలు
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల వేట షురూ అయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
- Author : Naresh Kumar
Date : 24-09-2023 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
Asian Games : ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట షురూ అయింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇవాళ మహిళల షూటింగ్, పురుషుల రోయింగ్‌తో పాటు మహిళల క్రికెట్‌లో పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో ఇండియా రజిత పతకం సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో మెహులీ ఘోష్, రమిత, ఆషి చౌక్సే షూటర్లతో కూడిన భారత జట్టు.. 1886 స్కోర్‌తో రెండో స్ధానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలుచుకుంది. ఇదే ఈవెంట్‌లో 1896 స్కోర్‌తో మొదటి స్ధానంలో నిలిచిన చైనా బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు రోయింగ్‌లో కూడా భారత్ సిల్వర్ మెడల్ కైవసం చేసుకుంది. రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్లో అర్జున్ లాల్, అరవింద్ సింగ్ రెండో స్ధానంలో నిలిచారు.
మహిళల క్రికెట్‌లోనూ భారత్‌కు పతకం ఖారారైంది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనూ బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ఒకే ఒక్క బ్యాటర్ రెండంకెల స్కోర్ సాధించగా…9 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. వీరిలో ఐదుగురు డకౌటయ్యారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లు పడగొట్టింది. టిటాస్ సాధు, అమోన్‌జోత్ కౌర్, గైక్వాడ్ , దేవిక ఒక్కో వికెట్ పడగొట్టారు. 52 పరుగుల టార్గెట్‌ను భారత మహిళల జట్టు 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్మృతి మంధాన 7 రన్స్‌కే ఔటైనా… షెఫాలీ వర్మ 17, రోడ్రిగ్స్ 20 పరుగులతో రాణించారు. ఈ విజయంతో ఫైనల్‌కు చేరిన భారత్ కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది.
ఈ సారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో (Asian Games) పోటీపడుతున్నారు. అథ్లెట్ల, హాకీ జట్లతో పాటుగా.. భారత మహిళా, పురుష క్రికెట్ జట్లు తొలిసారిగా ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి. బ్యాడ్మింటన్ , బాక్సింగ్, చెస్, షూటింగ్, ఆర్చరీ వంటి క్రీడల్లో ఎక్కువ పతకాలు వచ్చే అవకాశముంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సారి వంద పతకాలను గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగారు.
Also Read: Income Tax Refund : ఐటీ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా ? ఇది తెలుసుకోండి