2027 National Olympics: “ఖేలో ఆంధ్రప్రదేశ్” గా ఏపీ…
2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించే సంకల్పంతో, అధునాతన క్రీడా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లాలలో హాస్టల్ వసతులతో కూడిన క్రీడా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ‘‘ఖేలో ఆంధ్ర ప్రదేశ్’’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే క్రమంలో తీవ్రంగా కృషి చేస్తామని చెప్పారు.
- By Kode Mohan Sai Published Date - 04:11 PM, Fri - 20 December 24

2027లో ఏపీలో జాతీయ క్రీడలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవి కుమార్. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘ఏపీలో అధునాతన క్రీడా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఏపీలో పలు జిల్లాల్లో హాస్టల్ వసతులుతో కూడిన క్రీడా శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నాం’’ అని చెప్పారు.
‘‘ఖేలో ఆంధ్ర ప్రదేశ్’’గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. కేంద్రానికి 237 కోట్ల రూపాయల ‘‘డీపీఆర్’’లను సమర్పించి, ‘‘ఖేలో ఇండియా’’ నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంలో ఏపీకి కేవలం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు మాత్రమే ‘‘ఖేలో ఇండియా’’ నిధులు అందుకున్నాయి.
ఏపీలో క్రీడల్లో యువత బాగా రాణిస్తున్నారని, మెరుగైన సౌకర్యాలు కల్పించి, మంచి శిక్షణ అందిస్తే ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించే సామర్థ్యం రాష్ట్ర యువతకు ఉందని అభిప్రాయపడ్డారు. వర్ధమాన క్రీడాకారులకు విశాఖలో హాకీ క్రీడా వసతులు, ఒంగోలు, తిరుపతిలో వసతిగృహం (హాస్టల్) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.