Section 144: బెంగళూరులో స్కూల్స్, కాలేజీల వద్ద 144 సెక్షన్
- By Hashtag U Published Date - 09:59 AM, Thu - 10 February 22

బెంగళూరులో అనేక చోట్ల హిజాబ్‌పై గొడవలు పెరగడంతో పోలీసులు, ప్రభుత్వం అప్రమత్తమైంది. రాబోయే రెండు వారాల పాటు నగరంలో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థల వద్ద ప్రజలు పెద్దఎత్తున గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ హెచ్చరించారు. దీనికి సంబంధించి బెంగళూరు పోలీసు కమిషనర్ ఒక ఉత్తర్వును విడుదల చేశారు. నగరంలో నిరసన ప్రదర్శన జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేము కాబట్టి, ప్రజా శాంతి భద్రతలను కాపాడేందుకు సరైన భద్రతా చర్యలను అమలు చేయడం తప్పనిసరి అని ఆయన తెలిపారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం బెంగళూరు నగరంలోని పాఠశాలలు, పీయూ, డిగ్రీ కళాశాలల చుట్టూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 144 విధించబడుతుంది. ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 22 వరకు రెండు వారాల పాటు నిషేధాజ్ఞ అమలులో ఉంటుంది. విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి సమావేశాలు లేదా నిరసనలు నిషేధించబడతాయి.