Mekapati Goutham Reddy Funeral: గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి.. ప్రముఖుల కన్నీటి వీడ్కోలు..!
- Author : HashtagU Desk
Date : 23-02-2022 - 1:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. ఉదయగిరిలోని మెరిట్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మేకపాటి గౌతంరెడ్డి భౌతిక కాయానికి, ఆయన కుమారుడు కృష్ణార్జునరెడ్డి పట్టరాని దుఃఖంతో దహన సంస్కారాలు నిర్వహించారు. అనంతరం పోలీసులు మూడుమార్లు గాల్లోకి కాల్పులు జరిపి.. గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలుకుతూ వందనం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి దంపతులు గౌతంరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. ఇక అంత్యక్రియల సమయంలో గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య శ్రీకీర్తి, తల్లి మణిమంజరిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతంరెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఇకపోతే నెల్లూరు నుంచి ఉదయగిరికి వెళ్లే మార్గంలో తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకిరువైపులా బారులు తీరారు. గౌతంరెడ్డిని తీసుకెళ్తున్న వాహనంపై పూలు జల్లుతూ అశ్రు నయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.