Davos Tour : ప్రభుత్వ తీరుతో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక వేత్తలు: కిషన్ రెడ్డి
రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 05:31 PM, Fri - 24 January 25

Davos Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలను వేధిస్తోందని ఆరోపించారు. ఒప్పందాలు పేపర్‌కే పరిమితం కావొద్దు. రాష్ట్రానికి చెందిన వారిని దావోస్‌కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు అని వ్యాఖ్యానించారు.
తెలంగాణను అన్ని రంగాలలో తిరోగమన దిశలో నడిపించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పని చేస్తోందని ఆరోపించారు. దళితులకు ఇస్తామన్న రూ. 12 లక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని, ఆటో డ్రైవర్లు మొదలుకొని గీత కార్మికుల వరకూ కార్మికులకు ఇస్తామన్న భరోసాను ఇవ్వబోదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలకు అంతే లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ వ్యాపారాలకు అనువైన వాతావరణాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఎవరూ సంతృప్తికరంగా లేరని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అరకొరగానే అమలు చేస్తున్నారని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చేయట్లేదని, యువతకు రూ.4 వేల నిరుద్యోగ భృతిని ఇవ్వట్లేదని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయట్లేదని పేర్కొన్నారు.
Read Also: Edit Room : అప్పుడు బాబాయ్..ఇప్పుడు అబ్బాయి..ఇంత దారుణమా..?