Delhi: శాంతించిన యమునా నది.. అయినా ప్రజల్లో వీడని భయం?
ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు క
- By Anshu Published Date - 03:53 PM, Sun - 16 July 23

ప్రస్తుతం ఉత్తర భారత దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు నదులు చెరువులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిస్థితులు ఇప్పుడే సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఢిల్లీని ముంచెత్తిన వరద ప్రవాహం శనివారం కాస్త నెమ్మదించింది. తాజాగా మరోసారి భారీ వర్షం కురవడంతో మరొకసారి ఢిల్లీని వరదలు ముంచెత్తుతాయని ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి యమునా నది శాంతించినప్పటికీ ఈ వరదల కారణంగా మరొకసారి వరదలు పోటెత్తుతాయేమో అని ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయానికి యమునా నీటి మట్టం 205.98 మీటర్లకు తగ్గింది. వాస్తవానికి ప్రమాదకర నీటి మట్టమైన 205.33 కంటే ఇది ఎక్కువే. మళ్లీ వర్షాలు లేకపోతే నేటి రాత్రికి ఇది 205.75కు తగ్గవచ్చని భావిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే దిల్లీ పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు. ఈ విషయాన్ని సక్సేనా ట్విటర్‌లో వెల్లడించారు.
మరోవైపు యుమునా బ్యారేజీలో మొరాయిస్తున్న ఐదు గేట్లను తెరిచేందుకు యత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. యమున ప్రవాహం తగ్గిందని త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని ఆయన వెల్లడించారు. చాలా మంది ఢిల్లీ వాసులు తిరిగి వారి గృహాలకు చేరుకుంటున్నారు. మరోవైపు యమునా తీరాన ఉన్న మెట్రోస్టేషన్‌ను తెరిచినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఈ వరదల బీభత్సాల కారణంగా ఇప్పటికే దాదాపు పది మంది మరణించారు. నొయిడాలోని దనాకౌర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు యమునా ప్రవాహంలో కొట్టుకుపోయారు. యూపీలోని గౌతమ్ బుద్ధానగర్‌లో వరద తీవ్రత కొనసాగుతోంది. ఇక ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యుమున ప్రవాహాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో వరదల కారణంగా రూ.8 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించింది.