Cow Hug Day: ‘కౌ హగ్ డే’ పై వెనక్కి తగ్గిన కేంద్రం..
వాలెంటైన్స్ డే (Valentine's Day) ని జరుపుకునే ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ ఉత్తర్వులు విడుదల
- Author : Maheswara Rao Nadella
Date : 11-02-2023 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
వాలెంటైన్స్ డే (Valentine’s Day) ని జరుపుకునే ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’ (Cow Hug Day) గా జరుపుకోవాలంటూ ఉత్తర్వులు విడుదల చేసిన కేంద్రం యూటర్న్ తీసుకుంది. సోషల్ మీడియా నుంచి విపరీతమైన వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’ జరుపుకోవాలంటూ ఇటీవల కేంద్ర పశుసంవర్థక బోర్డు (ఏవీబీఐ)ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భారత సంస్కృతికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక అని, దానిని కౌగిలించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఆ ఉత్తర్వుల్లో ఏవీబీఐ పేర్కొంది. కౌ హగ్ డే (Cow Hug Day) పై ప్రజల్లో సానుకూలత వ్యక్తమైతే అంతకుమించి సంతోషం ఏముంటుందని కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా పేర్కొన్నారు.
అయితే, వాలెంటైన్స్ డే నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను ప్రకటించిందంటూ సోషల్ మీడియా దుమ్మెత్తి పోసింది. రాజకీయంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ‘కౌ హగ్ డే’ను తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే), టీఎంసీ దుమ్మెత్తి పోశాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఏవీబీఐ తన ప్రకటనను ఉపసంహరించుకుంది.
Also Read: Nayantara Sensational Decision: నయనతార సంచలన నిర్ణయం