శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
- Author : Vamsi Chowdary Korata
Date : 20-01-2026 - 12:43 IST
Published By : Hashtagu Telugu Desk
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేశారు.
- లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. విజయవంతంగా ముగిసిన యాత్ర
- మండల-మకరవిళక్కు సీజన్ ముగియడంతో శబరిమల ఆలయం మూసివేత
- పందలం రాజవంశీయులకు తాళాలు అప్పగించి సన్నిధికి తాళం
- ఫిబ్రవరి 12న నెలవారీ పూజల కోసం మళ్లీ తెరవనున్న ఆలయం
ఇదే సమయంలో పవిత్ర తిరువాభరణాల తిరుగు ప్రయాణం కూడా మొదలైంది. 30 మంది సభ్యుల బృందం ఈ ఆభరణాలను తిరిగి పందలం ప్యాలెస్‌కు తీసుకువెళ్తోంది. ఈ బృందం ఈ నెల 23న పందలం చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది మండల-మకరవిళక్కు సీజన్ చాలా ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని టీడీబీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర పూర్తయిందని తెలిపారు. పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
మళ్లీ తెరిచేది ఎప్పుడంటే?
తాజాగా ఆలయాన్ని మూసివేసినప్పటికీ, నెలవారీ పూజల కోసం ఫిబ్రవరిలో మళ్లీ తెరవనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు కుంభం మాసపు పూజల కోసం ఆలయాన్ని తెరిచి, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 10 గంటలకు తిరిగి మూసివేస్తారు. ఈ సమయంలో భక్తులు దర్శనానికి రావొచ్చని టీడీబీ స్పష్టం చేసింది.