Nuclear Strike : పాక్ అణ్వాయుధం ప్రయోగిస్తే.. భారత్ ఇలా అడ్డుకుంటుంది
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రద్యుమ్న బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ సెప్టర్(Nuclear Strike) అని కూడా పిలుస్తారు.
- By Pasha Published Date - 12:12 PM, Sat - 3 May 25

Nuclear Strike : కశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు ఏర్పడ్డాయి. రెండు కూడా అణ్వాయుధ దేశాలే కావడంతో యావత్ ప్రపంచం చూపు ప్రస్తుతం భారత్, పాక్‌ల వైపు ఉంది. భారత్ వద్ద 180, పాకిస్తాన్ వద్ద 170 అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. పాకిస్తాన్ ఒకవేళ అణ్వాయుధాలను ప్రయోగించాలంటే.. ముగ్గురు వ్యక్తులు కీలకం. పాకిస్తాన్ ప్రధాన మంత్రి, దేశాధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ కలిసి అణ్వాయుధ ప్రయోగంపై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ఈ ముగ్గురూ ఏకాభిప్రాయానికి వస్తేనే అణ్వాయుధ ప్రయోగానికి అనుమతి మంజూరు అవుతుంది. లేదంటే దాన్ని వినియోగించడం సాధ్యం కాదు. అటువంటి ఏకాభిప్రాయం కుదిరే అవకాశమే లేదని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ భారత్‌పై అణ్వాయుధాన్ని ప్రయోగించాలనే ఆలోచనను చేస్తే.. ఆ వెంటనే కొన్ని క్షణాల్లోనే భారత్ అణ్వాయుధానికి యావత్ పాకిస్తాన్ మొత్తం బుగ్గి కావాల్సి ఉంటుంది. అంతేకాదు.. పాకిస్తాన్ అణ్వాయుధాన్ని గాల్లోనే పేల్చేసే సత్తా కూడా భారత సైన్యానికి ఉంది. అదెలాగో తెలుసుకుందాం..
Also Read :Repairability Index : ఫోన్లు, ట్యాబ్‌లకు ‘రిపేరబిలిటీ ఇండెక్స్’.. మనకు లాభమేంటి ?
భారత్‌కు నాలుగు అంచెల రక్షణ
నేటికాలంలో ఏదైనా అణ్వాయుధాన్ని మిస్సైల్ ద్వారా ప్రయోగించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. లేదంటే యుద్ధ విమానంతో భూమిపై జారవిడవ వచ్చు. పాకిస్తాన్ యుద్ధ విమానమైనా, మిస్సైల్ అయినా భారత గగనతలంలోకి ప్రవేశిస్తే.. తిరిగి సేఫ్‌గా వెళ్లే అవకాశాలు ఉండవు. దీనికి కారణం భారత్‌కు ఉన్న నాలుగు అంచెల గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ. ఆ వివరాలేంటో చూద్దాం..
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ (Prithvi Air Defence)
పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ప్రద్యుమ్న బాలిస్టిక్ మిస్సైల్ ఇంటర్ సెప్టర్(Nuclear Strike) అని కూడా పిలుస్తారు. అత్యంత ఎత్తు నుంచి భారత్‌లోకి ప్రవేశించే పాకిస్తాన్ మిస్సైళ్లు, యుద్ధ విమానాలను ఇది తన మిస్సైళ్లతో కూల్చేయగలదు. గరిష్ఠం 50 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల మేర ఎత్తు నుంచి వచ్చే మిస్సైళ్లు, యుద్ధ విమానాలను పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురిపెట్టి కూలుస్తుంది. ఇది ఏకకాలంలో పదుల సంఖ్యలో మిస్సైళ్లను గగనతలం వైపుగా వదులుతుంది. 300 కి.మీ నుంచి 2000 కి.మీ దూరంలో ఉండగానే శత్రువుల మిస్సైళ్లు, యుద్ధ విమానాలపైకి గురిపెట్టే సత్తా దీని సొంతం. మాక్ 5 స్పీడుతో పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని మిస్సైళ్లు ప్రయాణిస్తాయి.
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD)
అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD) వ్యవస్థ అనేది తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ వేగంగా భారత్‌లోకి వచ్చే బాలిస్టిక్ మిస్సైళ్లను కూల్చేయగలదు. ఇది మన దేశపు రక్షణ వ్యవస్థలో రెండో అంచెలో ఉంటుంది. పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను సపోర్ట్ చేస్తూ ఇది పనిచేస్తుంది. పృథ్వి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కువ ఎత్తులోని శత్రు మిస్సైళ్లను కూలుస్తుంది. తక్కువ ఎత్తులోని శత్రు మిస్సైళ్ల సంగతిని అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చూసుకుంటుంది. అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సంధించే మిస్సైళ్లు మాక్ 4.5 స్పీడుతో ప్రయాణిస్తాయి. ఇవి గరిష్ఠంగా 100 కి.మీ దూరం ప్రయాణించి శత్రు మిస్సైళ్లను కూల్చేస్తాయి.
ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (Akash Air Defence)
ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసింది. మన హైదరాబాద్‌లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లోనే దీన్ని తయారు చేస్తారు. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని చిన్నపాటి ట్రక్కులో పెట్టుకొని దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మోహరించొచ్చు. ఆ ట్రక్కులో నుంచే మిస్సైళ్లను ఆకాశం వైపుగా వదలొచ్చు. గరిష్ఠంగా 45 కి.మీ దూరంలోని శత్రు మిస్సైళ్లను ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్‌లోని మిస్సైళ్లు ఛేదించగలవు. తక్కువ ఎత్తులో ఎగిరే మిస్సైళ్లే దీని టార్గెట్. ఈ మిస్సైళ్లు కూడా మాక్ 2.5 స్పీడుతో ప్రయాణించగలవు.
ఎస్-400 రక్షణ వ్యవస్థ
ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థను రష్యా తయారు చేసింది. వీటిని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ 1 గగనతల రక్షణ వ్యవస్థ. ఇది ఏకకాలంలో 300 శత్రు మిస్సైల్ టార్గెట్లను గుర్తించి, వాటిని లక్ష్యంగా చేసుకొని మిస్సైళ్లను ప్రయోగించగలదు. తక్కువ ఎత్తులో ప్రయాణించే బాలిస్టిక్ మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిస్సైళ్లు, స్టెల్త్ విమానాలను కూడా ఇది గుర్తించి ధ్వంసం చేయగలదు. దీనిలో అత్యాధునిక రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. గరిష్ఠంగా 600 కి.మీ దూరంలో ఉన్న శత్రు మిస్సైళ్లు, యుద్ధ విమానాల టార్గెట్లను కూడా ఎస్-400 ట్రేస్ చేయగలదు. అత్యంత కచ్చితత్వంతో 400 కి.మీ దూరంలో ఉన్న టార్గెట్లను ఇది గుర్తిస్తుంది. వాటిని ధ్వంసం చేసేందుకు మిస్సైళ్లను వదులుతుంది. అంటే భారత సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉండగానే మిస్సైళ్లు, యుద్ధ విమానాలను ఎస్-400 వ్యవస్థ గుర్తించగలదు.