CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-05-2026 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ నంబర్ 118ను సాధించింది. తాజాగా విడుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీ మద్దతు ప్రకటించడంతో విజయ్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు వీసీకే పార్టీ నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున లేఖ అందుకున్నారు.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ (5 సీట్లు), సీపీఐ (2 సీట్లు), సీపీఎం (2 సీట్లు) పార్టీలతో చర్చలు జరిపింది. ఈ పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 116కి పెరిగింది. తాజాగా వీసీకే తన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం సమకూరింది.
వీసీకే అధినేత తోల్. తిరుమావళవన్ నేడు టీవీకేకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా లేఖ అందించారు. తొలి ఎన్నికల్లోనే అద్భుత ప్రదర్శన చేసిన టీవీకే, దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలైన డీఎంకే (59), అన్నాడీఎంకే (47)లను వెనక్కి నెట్టింది.
ఈ తాజా పరిణామంతో, గవర్నర్ ఆర్.వి. అర్లేకర్ త్వరలోనే విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం ఉంది.