Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!
- Author : Vamsi Chowdary Korata
Date : 08-05-2026 - 4:52 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడులో కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టీవీకే పార్టీకి.. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ఇవ్వగా.. తాజాగా చిన్న చిన్న పార్టీల మద్దతును కూడబెట్టడంలో విజయ్ సఫలీకృతం అయినట్లు తెలుస్తోంది. సీపీఐ, వీసీకే పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక డీఎండీకేతో టీవీకే నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. దీంతో టీవీకే పార్టీ మరికాసేపట్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనుంది.
ఈనెల 4వ తేదీన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. తమిళనాడులో హంగ్ ఏర్పడటంతో తీవ్ర రాజకీయ అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీకి.. ఇప్పటివరకు ఇతర పార్టీల మద్దతు లభించకపోవడంతో.. ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడులో రకరకాల ఊహాగానాలు, కొత్త పొత్తులకు సంబంధించిన చర్చలు, పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలోనే రెండు సార్లు గవర్నర్‌ను కలిసి తమను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని విజయ్ కోరినా.. మెజార్టీ 119 మంది బలం చూపించాలని పేర్కొనడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా తమిళ హైడ్రామాకు చెక్ పడినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీకే పార్టీకి మద్దతు తెలిపేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఒక సీటు ఉన్న డీఎండీకే పార్టీ మద్దతు కోసం కూడా టీవీకే నేతలు ప్రయత్నాలు చేస్తూ.. చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకు లభించడంతో.. ఇవన్నీ కలిపితే.. టీవీకే పార్టీ మెజార్టీ మార్కును దాటుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ సాయంత్రమే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిసి.. మెజార్టీ గురించి వివరించేందుకు టీవీకే పార్టీ అపాయింట్‌మెంట్ కోరింది. సాయంత్రం విజయ్ నేతృత్వంలోని టీవీకే నేతలు.. తమ పార్టీతోపాటు, వారికి మద్దతుగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. గవర్నర్ అనుమతిస్తే.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ కానుంది. అదే జరిగితే.. తమిళనాట నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడనుంది.