Union Budget : 200 జిల్లాల్లో కేన్సర్ కేంద్రాల ఏర్పాటు..
ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
- By Latha Suma Published Date - 12:30 PM, Sat - 1 February 25

Union Budget : 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే పీఎమ్ జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం చేకూరబోతోంది.
ఇక, ఏటికొప్పాక బొమ్మలకు మహర్దశ రానుంది. పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి సీతారామన్.. భారతదేశాన్ని టాయ్ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. బొమ్మల కోసం జాతీయ ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకత తీసుకొచ్చే కళాకృతుల్లో ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. తాజా ప్రకటనతో ఇప్పుడు ఆ విలువ మరింత పెరగనుంది. కాగా, అడవులలో దొరికే అంకుడు చెట్ల కొమ్మలను తెచ్చి ఎండబెట్టి ఈ బొమ్మలను తయారు చేస్తారు. పర్యావరణహితమైన, సహజసిద్ధమైన వనరులతో చేసే ఈ లక్క బొమ్మలు అన్ని వయసుల వారిని మంత్రముగ్దుల్ని చేసేలా ఉంటాయి.
ఇటీవలే రిపబ్లిక్ పరేడ్ లో యావత్ దేశాన్ని ఆకర్షించిన ఏటికొప్పాక శకటం మూడో స్థానంలో నిలిచి జాతీయ స్థాయిలో పేరు గడించింది. సుమారు 400 ఏళ్ల చరిత్ర గల ఈ బొమ్మలను సహజ సిద్ధమైన పూలు, బెరడు నుంచి వచ్చిన రంగులతో తీర్చిదిద్దుతారు. రాంచీ నుంచి దిగుమతి చేసుకున్న లక్కతో వీటిని తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలో మహిళలకు సైతం శిక్షణ ఇచ్చి, ఉపాధి పొందేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు కేంద్రమూ అందుకు చేతులు కలిపింది. తమ వంతుగా ప్రజలు ఉపాధి అందేందుకు భారత్ ను టాయ్ హబ్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటోంది.