కొత్త ఏడాదిలో కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న సిగరెట్లు, బీడీ, పాన్ మసాలా ధరలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 01-01-2026 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
New Tax : సిగరెట్లు, బీడీలు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తుల వినియోగించేవారికి భారీ షాక్ తగలనుంది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఇలాంటి వస్తువులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్‌ను రద్దు చేసి.. వాటి స్థానంలో కొత్త పన్నులను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్యాక్స్‌లతో పాటు ప్రత్యేక సెస్ కూడా విధించనున్నారు. దీంతో పొగాకు వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది.
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశంలో పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రభుత్వం పాత సెస్‌ను రద్దు చేసి.. దాని స్థానంలో హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్‌ను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై గరిష్టంగా 40 శాతం జీఎస్టీతో పాటు అదనపు సుంకాలు పడనుండటంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని.. పాన్ మసాలాపై కొత్త సెస్‌ను అమల్లోకి తీసుకురానుంది.
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు, సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ( జీఎస్టీ ) విధించనున్నారు. అదేవిధంగా బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తించనుంది. జీఎస్టీతో పాటు అదనంగా హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ పేరుతో కొత్త పన్నును పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై విధించనున్నారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఈనెల 31వ తేదీతో ముగియనుంది. వీటితో పాటు పొగాకు ఉత్పత్తుల తయారీ యంత్రాలకు సంబంధించి కొత్త ప్యాకింగ్ మెషిన్ నిబంధనలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఆరోగ్యానికి హానికరమైన ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.