Tablighi Jamaat: తబ్లిగి జమాత్ చీఫ్ మౌలానా సాద్‌కు ఊరట.. ఐదేళ్ల తర్వాత క్లీన్ చిట్!
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్‌లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది.
- By Gopichand Published Date - 07:01 PM, Thu - 4 September 25

Tablighi Jamaat: 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో నిబంధనలను ఉల్లంఘించి మహమ్మారిని వ్యాప్తి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న తబ్లిగి జమాత్ (Tablighi Jamaat) చీఫ్ మౌలానా సాద్‌కు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. దాదాపు ఐదేళ్ల పాటు సాగిన విచారణ తర్వాత ఆయన నిర్దోషి అని పోలీసులు ప్రకటించారు.
ఏమి జరిగింది?
2020లో కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో మౌలానా సాద్ సోషల్ మీడియా ద్వారా విదేశాల నుండి, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలను పిలిచి నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో సమావేశపరిచారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మౌలానా సాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు సుదీర్ఘ విచారణ చేపట్టారు.
Also Read: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5వేల మంది ఎంపిక!
పోలీసుల విచారణలో కీలక అంశాలు
విచారణలో భాగంగా పోలీసులు మౌలానా సాద్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిలో రికార్డు అయిన ఆయన ప్రసంగాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఈ ప్రసంగాల్లో ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు లేవని పోలీసులు తెలిపారు. మౌలానా సాద్ చేసిన ప్రసంగాలన్నీ ఇస్లాం మతానికి సంబంధించినవని, వాటిలో ఆయన ప్రజలను చెడు పనులకు దూరంగా ఉండమని, మంచి పనులు చేయమని మాత్రమే కోరారని పోలీసులు వివరించారు. ఈ ప్రసంగాల్లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అయితే 2020 నుండి మౌలానా సాద్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఆయన ల్యాప్‌టాప్, ఇతర వస్తువుల ఫోరెన్సిక్ విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.
ఢిల్లీ హైకోర్టులో కూడా ఊరట
ఈ కేసులో గత నెలలోనే ఢిల్లీ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైన సమయంలో నిజాముద్దీన్ మర్కజ్‌లో నివసిస్తున్న ప్రజలు, ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని కోర్టు పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించి జమాత్‌కు చెందిన 70 మందిపై నమోదైన 16 ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.