Shashi Tharoor : మరోసారి శశి థరూర్ భిన్న స్వరం..‘అనర్హత’ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు
బుధవారం రోజు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి ఎలా మంత్రిగా కొనసాగుతారు? ఇది చాలామందికి సహజమైన విషయమే. ఈ అంశంలో నాకు ప్రత్యేకంగా తప్పు ఏదీ కనిపించడం లేదు అని స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 04:30 PM, Wed - 20 August 25

Shashi Tharoor : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, సీనియర్ ఎంపీ డాక్టర్ శశి థరూర్ మళ్లీ తన భిన్న వైఖరితో జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అనర్హత బిల్లులు’పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండియా కూటమి పార్టీల మధ్యనూ, రాజకీయ విశ్లేషకుల మధ్యనూ పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ బిల్లుల ప్రకారం, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, లేదా మంత్రులు ఎవరైనా వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉన్నట్లయితే, వారు తమ పదవిని కోల్పోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని పారదర్శక పాలనకు ఒక ముఖ్యమైన అడుగు అన్నట్లు చెబుతోంది. ఇదే సమయంలో, ‘ఇండియా’ కూటమిలోని ప్రతిపక్ష పార్టీలు దీనిని రాజకీయంగా ప్రేరితమైన చర్యగా, ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తున్నాయి.
Read Also: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. ఏకంగా 80 శాతం బోనస్!
అయితే, శశి థరూర్ మాత్రం ఈ విషయంలో కూటమి అభిప్రాయానికి భిన్నంగా స్పందించారు. బుధవారం రోజు లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి ఎలా మంత్రిగా కొనసాగుతారు? ఇది చాలామందికి సహజమైన విషయమే. ఈ అంశంలో నాకు ప్రత్యేకంగా తప్పు ఏదీ కనిపించడం లేదు అని స్పష్టం చేశారు. ఇది ఒక తార్కికమైన అంశమని, నేరానికి పాల్పడిన వారిని పదవుల నుంచి తప్పించడం అనేది ఒక సమంజసమైన ప్రక్రియగా ఆయన అభివర్ణించారు. అయితే ఇదే తుదినిర్ణయమని అనుకోవద్దని తాను ఇంకా బిల్లును పూర్తిగా చదవలేదని స్పష్టం చేశారు.
అలానే, ఈ బిల్లుపై లోతైన చర్చ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బిల్లులోని ప్రతీ అంశాన్ని సమగ్రంగా విశ్లేషించేందుకు దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (JPC) పంపాలని ఆయన సూచించారు. అధికారపక్షం ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతామని ప్రకటించిన దాని పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే ప్రక్రియ. బిల్లును పరిగణనలోకి తీసుకుని పార్లమెంటరీ వ్యవస్థల ద్వారా సమీక్షించడం మంచిదే అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో శశి థరూర్ మరోసారి పార్టీ లైనుకు భిన్నంగా స్పందించిన నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. గతంలోనూ ఆయన పలు కీలక సందర్భాల్లో పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా అభిప్రాయాలు వెల్లడించడం రాజకీయంగా దుమారం రేపింది. తాజా వ్యాఖ్యలు కూడా ఆ పరంపరలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో మరియు ‘ఇండియా’ కూటమిలో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బిల్లులపై తుది నిర్ణయం ఎటు వైపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.