T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్రత్యేక తరగతులు
- Author : Prasad
Date : 30-05-2026 - 6:28 IST
Published By : Hashtagu Telugu Desk
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిర్వహించనున్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం టి-సాట్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను అందించనుంది. ఈ విషయాన్ని టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు, రైల్వే శాఖ ఇటీవల 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సికింద్రాబాద్, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్‌ల పరిధిలో 1,420 పోస్టులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టి-సాట్ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందని తెలిపారు. పరీక్షకు అవసరమైన మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అంశాలపై సుమారు 300 గంటల డిజిటల్ పాఠ్యాంశాలు రూపొందించినట్లు వెల్లడించారు. ఈ పాఠాలు జూన్ 1 నుంచి సెప్టెంబర్ వరకు రోజుకు రెండు గంటల చొప్పున ప్రసారం కానున్నాయి. టి-సాట్ విద్య ఛానల్‌లో ఉదయం 6.00 గంటల నుంచి 8.00 గంటల వరకు, టి-సాట్ నిపుణ ఛానల్‌లో రాత్రి 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. అభ్యర్థులు తమకు అనుకూలమైన సమయంలో ఈ పాఠాలను వీక్షించి పరీక్షలకు సిద్ధం కావచ్చని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ లేదా తత్సమాన అర్హత కలిగి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులకు ఈ డిజిటల్ కంటెంట్ ఎంతో ఉపయోగపడుతుందని సీఈవో పేర్కొన్నారు. అక్టోబర్‌లో జరగనున్న రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ వరకు ఈ ప్రత్యేక పాఠాలు కొనసాగుతాయని తెలిపారు.