CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్ 2047తో అభివృద్ధి చేసుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 01:59 PM, Wed - 20 August 25

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, ఐటీ రంగ ప్రాధాన్యత, హైదరాబాద్ నగర ప్రగతికి పూర్వపు ముఖ్యమంత్రుల కృషిని ప్రశంసించారు. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసిన మహానేత రాజీవ్ గాంధీ గారు. ఆయన చూపించిన దిశే ఎందరో తెలుగువారిని గూగుల్ వంటి గ్లోబల్ సంస్థల్లో ఉన్నత పదవుల్లో నిలిపింది అని వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో తెలుగు యువత రాణించడానికి స్థిరమైన మౌలిక వనరులు అవసరమైందని, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లు హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేశారు.
Read Also: Robo : చంద్రబాబును ఆశ్చర్యపరిచిన రోబో ..ఏంచేసిందో తెలుసా..?
1994 నుండి 2014 వరకు సీఎం లుగా పనిచేసిన వారు నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారనీ, వారి సేవలను మరిచిపోలేమని తెలిపారు. హైటెక్ సిటీ నిర్మాణానికి ఆరంభ దశలో వ్యతిరేకత ఎదురైంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం సింగపూర్, టోక్యో లాంటి ప్రపంచ మేగాసిటీలతో పోటీపడుతోంది అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాలకుల చిత్తశుద్ధి కీలకమని చెబుతూ మన ఐటీ నిపుణులు అమెరికాలో పనిచేయకపోతే అక్కడ ఇండస్ట్రీలు నిలిచిపోతాయి. అలాంటి నిపుణులను మనమే తయారు చేస్తున్నాం. తెలంగాణ విద్యార్థులు ఇక్కడే చదివేందుకు అనేక ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు ఏర్పడ్డాయి అన్నారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేయనున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి మాట్లాడిన సీఎం ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. అందుకే అన్ని సౌకర్యాలతో కొత్త కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది అని వివరించారు.
ఇకపోతే, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును రాజకీయంగా అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పేద ప్రజలు మూసీ మురికిలో జీవించాలనుకుంటారా? ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? ప్రక్షాళన జరగాలి, మెట్రో విస్తరణ జరుగాలి. ఇవి హైదరాబాద్ రూపాన్ని మారుస్తాయి అని అన్నారు. రాష్ట్ర భద్రతా పరిస్థితుల గురించి కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి మేము ఉద్యోగ భద్రతతో పాటు శాంతియుత వాతావరణం కల్పించాం. రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇది తెలంగాణ రైజింగ్ 2047 దిశగా మేం తీసుకుంటున్న అడుగు అని స్పష్టం చేశారు. ఒక్క ఒక్క అభివృద్ధి పనిని రాజకీయ లాభనష్టాల కన్నా ప్రజల అవసరాల దృష్టితో చూడాలని ఆయన హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధికి సంకల్ప బలమే ఆయుధమని, తెలంగాణ ప్రజలు ఇక,పై అభివృద్ధిని మరింత వేగంగా చూడబోతున్నారని పేర్కొన్నారు.