Patel Vs RSS : ఆర్ఎస్ఎస్‌తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌లకు(Patel Vs RSS) వైరం ఉండేది అనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.
- By Pasha Published Date - 03:36 PM, Tue - 8 April 25

Patel Vs RSS : ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భావజాలానికి అస్సలు పొంతన లేదని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. చివరకు ఆర్ఎస్ఎస్‌ను పటేల్ బ్యాన్ కూడా చేయించారని ఆయన గుర్తు చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్రనూ పోషించని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ, పటేల్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి గత 140 ఏళ్లుగా సేవ చేస్తోంది. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లకు చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ఏమీ లేవు. ఎందుకంటే దేశం కోసం వాళ్లేం చేయలేదు’’ అని ఖర్గే ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సర్దార్ పటేల్ మెమోరియల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఖర్గే ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Pulivendula Satish Reddy: సజ్జలకు షాక్.. పులివెందుల సతీశ్‌కు జగన్ కీలక బాధ్యతలు!
ఆర్ఎస్ఎస్, బీజేపీ హైజాక్ పాలిటిక్స్
జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌లకు(Patel Vs RSS) వైరం ఉండేది అనేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు. వాస్తవానికి ఆ ఇద్దరు దిగ్గజ నేతల మధ్య స్నేహపూర్వక సంబంధాలే ఉండేవన్నారు. గాంధీజీతో సంబంధమున్న సంస్థలను ఆర్ఎస్ఎస్, బీజేపీ హైజాక్ చేస్తున్నాయని, వాటిని వాస్తవ విరుద్ధ కోణంలో ప్రజలకు చూపిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. వారణాసిలోని సర్వసేవా సంఘ్, గుజరాత్ విద్యాపీఠ్‌లు ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లాయన్నారు.
అంబేద్కర్‌కు ఆ అవకాశం గాంధీ, పటేల్ వల్లే..
బాబా సాహెబ్ అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా చేయడంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని ఖర్గే గుర్తు చేశారు. ఈవిషయాన్ని 1949 నవంబరు 25న భారత రాజ్యాంగ సభ వేదికగా స్వయంగా అంబేద్కర్ చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేనిదే రాజ్యాంగ రూపకల్పన జరిగేదే కాదని అంబేద్కర్ చెప్పారని పేర్కొన్నారు. ‘‘ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతులను ఆర్ఎస్ఎస్ మనుషులు దహనం చేస్తున్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణం నుంచి మోడీ తీసివేయించారు. రాజ్యసభ వేదికగా అంబేద్కర్‌ను అవమానించేలా అమిత్‌షా మాట్లాడారు’’ అని ఖర్గే తెలిపారు.