PM Modi : ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌లు..అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు: ప్రధాని మోడీ
PM Modi visited Wardha in Maharashtra: మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు.
- By Latha Suma Published Date - 05:37 PM, Fri - 20 September 24

PM Modi visited Wardha in Maharashtra: ప్రధాని మోడీ నేడు మహారాష్ట్రలోని వార్ధాలో పర్యటించారు. ప్రభుత్వ ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పథకాన్ని ప్రారంభించారు. అలాగే, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మోడీ మాట్లాడుతూ..మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు. హిందూ సంప్రదాయాలను పణంగా పెడుతూ, బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన తీరును కొనసాగిస్తోందని చెప్పారు.
Read Also: Weddings : నవంబర్-డిసెంబర్ మధ్య నుండి ఇండియాలో 35 లక్షల వివాహాలు..
కాంగ్రెస్ పార్టీ నేతలు విదేశాలకు వెళ్లి అక్కడ దేశ వ్యతిరేక ప్రసంగాలు చేస్తుంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌లు, అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారని చెప్పారు. భారత సంస్కృతిని గౌరవించే పార్టీ గణపతి పూజను అగౌరవపరచదని, కాంగ్రెస్ పార్టీకి గణపతి పూజతోనూ సమస్య ఉందని విమర్శించారు. తాను గణపతి పూజకు వెళ్లడంతో దీన్ని వారు సమస్యగా భావిస్తున్నారని చెప్పారు. కాగా, కొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి, స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు. నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయి, ద్వేషం అనే దెయ్యం ప్రవేశించిందని మోడీ దుయ్యబట్టారు. కర్ణాటక, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కష్టాల్లోకి నెట్టేస్తోందని అన్నారు. విదేశాలకు వెళ్లి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ భరతమాతను, దేశ సంస్కృతిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రాజకుటుంబమే అని ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు.