West Bengal: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని వణికించిన టైపింగ్ మిస్టేక్
- By hashtagu Published Date - 09:29 AM, Wed - 2 March 22

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌లు ఉప్పు, నిప్పులాంటి వారు. అవకాశం దొరికితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఇప్పడు చిన్న విషయం ఒకటి ఆ రాష్ట్రంలో పెద్ద రాజకీయ వివాదమే సృష్టించింది. ఈ నెల ఏడో తేదీన ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ప్రభావం చూపనుంది. సంప్రదాయం ప్రకారమయితే అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాల్సిన తేదీని కేబినెట్ నిర్ణయిస్తుంది. దీనిపై మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి, గవర్నర్‌కు పంపిస్తారు.
గవర్నర్ సంతకం చేస్తే అనంతరం దానిపై నోటిఫికేషన్ వస్తుంది. ఇది చాలా రొటీన్ వ్యవహారం. ఎలాంటి ఇంపార్టెన్స్ ఉండదు. మాములుగా అయితే చదవకుండానే సంతకాలు పెట్టాల్సిన ఫైల్ లాంటిది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. 7వ తేదీ 2 pmకు బదులు 2amన అసెంబ్లీ ప్రారంభమవుతుందంటూ కేబినెట్ తీర్మానం పేపర్లో ఉంది. కేవలం టైపింగ్ మిస్టేక్ కారణంగా ఈ పొరపాటు జరిగింది.కేబినెట్… 2amన అసెంబ్లీ ప్రారంభం కావాలని తీర్మానించిందని చెబుతూ ఆ మేరకు సంతకం పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు. అర్ధరాత్రి సమావేశాలు ఏమిటని విమర్శలు రావడంతో కేబినెట్ తీర్మానించిందని, దాని ఫాలో కావడం తన డ్యూటీ అని గవర్నర్ వివరణ ఇచ్చారు.
ఇది కేవలం టైపింగ్ మిస్టేక్ అని 2 pmకే సభ ప్రారంభమవుతుందని ప్రభుత్వం గవర్నర్‌కు నోట్ పంపించింది. అయితే 2 pmకు మార్చాలని అనుకున్నా మళ్లీ కేబినెట్‌లో చర్చించి తీర్మానం చేసి పంపాలంటూ గవర్నర్ అబ్జక్షన్ చెప్పారు. ప్రోసీజర్ ఎందుకు పాటించలేదో వచ్చి చెప్పాలంటూ చీఫ్ సెక్రటరీకి రిటెన్ నోట్ పంపించారు. దీనిపై రిటెన్ రిప్లై ఇవ్వాలని ఆదేశించారు. అసలే బెంగాల్ సీఎం మమతకు, ఆ రాష్ట్ర గవర్నర్ కు మధ్య ఉప్పు నిప్పు లా ఉన్న పరిస్థితి..ఇప్పుడు మరింత జటిలంగా మారింది.