Operation Sindoor: 9 ఎయిర్‌పోర్ట్‌లు క్లోజ్.. వాయుసేన ఆధీనంలోకి శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్
పాకిస్తాన్(Operation Sindoor) వైపు నుంచి దాడి జరిగే ముప్పు ఉన్నందున మన దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు.
- By Pasha Published Date - 09:01 AM, Wed - 7 May 25

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాడులు చేసింది. ఈ దాడులు జరిగాక పాకిస్తాన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. భారత్‌పై ప్రతిదాడి చేస్తామని ప్రకటించింది. దీనిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి కూడా సమాచారాన్ని అందించింది. ఈ లెక్కన భారత్‌లోని జమ్మూకశ్మీరు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అందుకే అక్కడ భారత్ పెద్దఎత్తున యాంటీ మిస్సైల్ సిస్టమ్స్, గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించింది.
పాక్ కాల్పులు.. ముగ్గురు భారత పౌరుల మృతి
పాకిస్తాన్ ఆర్మీ జమ్మూకశ్మీరులోని సరిహద్దు గ్రామాలపై భీకర కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో జమ్మూకశ్మీరులోని సరిహద్దు గ్రామానికి చెందిన ముగ్గురు భారత పౌరులు చనిపోయారు. అమాయక ప్రజల ప్రాణాలను పాక్ తీసిందని భారత సైన్యం ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని వెల్లడించింది.
Also Read :India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?
భారత్‌లోని 9 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత
పాకిస్తాన్(Operation Sindoor) వైపు నుంచి దాడి జరిగే ముప్పు ఉన్నందున మన దేశంలోని 9 ఎయిర్‌పోర్ట్‌లను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల, లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్, భుజ్, జామ్ నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ సహా కీలక విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశారు. దేశంలోని 9 నగరాలకు విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు అని తెలిపింది. ఇక జమ్మూకశ్మీరులోని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దాన్ని భారత వాయుసేన తమ ఆధీనంలోకి తీసుకుంది. పాక్ వైపు నుంచి దాడి జరిగే అవకాశం ఉన్నందున జమ్మూ కశ్మీర్‌లోని విద్యాసంస్థలను మూసివేశారు. ఇక వివిధ ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్, పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశాయి. పలు విమాన సర్వీసులను ఆయా దేశాల విమాన సర్వీసులను దారి మళ్లించాయి. ఇతర దేశాల గగనతలం మీదుగా వాటిని నడపాలని నిర్ణయించాయి.
Also Read :Pakistanis Deaths: 5 విమానాలను కూల్చేశాం.. చనిపోయింది 11 మందే.. మేమూ దాడి చేస్తాం : పాక్
ఇవాళే భారత్‌లో పెద్దస్థాయిలో మాక్ డ్రిల్
మరోవైపు ఈరోజు భారత్‌లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగబోతోంది. దేశంలోని 244 జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.యుద్ధం వంటివి వస్తే ఎలా స్పందించాలి ? ఎలా రక్షించుకోవాలి ? అనే అంశాలపై ఈ డ్రిల్స్ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. భారత్‌పై గగనతల దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలి ? అందుకు అవసరమైన వార్నింగ్ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ? వాటిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి ? అనే అంశాలపైనా ఇవాళ జరిగే మాక్ డ్రిల్స్‌లో ప్రజలకు తెలియపరుస్తారు.