Nawaz Sharif : ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం: మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
Nawaz Sharif : ఒకప్పుడు భారత్‌లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
- By Latha Suma Published Date - 07:47 PM, Thu - 17 October 24

Minister Jaishankar Pakistan Tour : విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన గురించి పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత మీడియాతో మాట్లాడారు. ఈ పర్యటన భారత్-పాక్ మధ్య ఒక ఆరంభం అన్నారు. భారతదేశం- పాకిస్థాన్ గతాన్ని విడిచిపెట్టి, ఇంధనం, వాతావరణ మార్పు వంటి భవిష్యత్తు సమస్యలను దృష్టి సారించాలని తెలిపారు. ఎక్కడ నుంచి వదిలేశామో అక్కడి నుంచి ప్రారంభించాలని నవాజ్ షరీఫ్ అన్నారు. గత 75 ఏళ్లు ఇలాగే గడిచిపోయాయని.. ఇంకో 75 ఏళ్లు వృథా కాకూడదన్నారు. శాంతి ప్రక్రియకు విఘాతం కలిగించవద్దని పాకిస్థాన్ మాజీ ప్రధాని అన్నారు. అందుకే ఇరువర్గాలూ సీరియస్‌గా కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు. మనం పొరుగువారిని మార్చలేమన్నారు.
గతంలోకి వెళ్లవద్దని, భవిష్యత్తును చూడాలని, గతంలో జరగకూడనివి జరిగాయని మాజీ ప్రధాని షరీఫ్ చెప్పారు. భవిష్యత్తులో చాలా అవకాశాలు ఉన్నాయని.. ఒకప్పుడు భారత్‌లో కరెంటు కొరత ఉండేదని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్థాన్ నుంచి కరెంటును కొనుగోలు చేయాలని భావించినట్లు, తనతో చర్చించినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. మోడీ మమ్మల్ని కలవడానికి రావల్పిండి రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. మా అమ్మతో కూడా చాలా సేపు మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. ఇది చిన్న విషయం కాదన్నారు.
మా నాన్న పాస్‌పోర్టులో ఆయన జన్మస్థలం అమృత్‌సర్ (పంజాబ్) అని రాసి ఉందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. మేము (భారతదేశం-పాకిస్తాన్) ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష, ఆహారాన్ని పంచుకుంటామన్నారు. ఇరుదేశాల రిలేషన్‌షిప్‌లో సుదీర్ఘ విరామం ఉన్నందుకు తాను సంతోషంగా లేనన్నారు. నాయకుల మధ్య సత్ప్రవర్తన లేకపోవచ్చు కానీ, ప్రజల మధ్య అనుబంధం చాలా బాగుంటుందన్నారు.