Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
Chhattisgarh : దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
- By Latha Suma Published Date - 05:29 PM, Fri - 4 October 24

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసు..విచారణ వాయిదా
కాగా, గురువారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని బొంతలంక-జారాపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి నుంచే కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల శిబిరం వద్దకు చేరుకునే టైంలో మావోయిస్టులు పోలీసులను గమనించారు. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కిరణ్ చౌహాన్ చెప్పారు.
మరోవైపు సెప్టెంబర్ 03వ తేదీన ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో భారీ ఎన్‌కౌంటర్‌లో జరిగింది. బీజాపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లో మావోలు ఉన్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు.. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 9మంది మావోలు మృతిచెందారని అధికార వర్గాలు తెలిపాయి. ఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 303 సెల్ఫ్ లోడింగ్ రైపిల్స్‌తోపాటు 12 తుపాకులు దొరికినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Vitamin D : విటమిన్ డి లోపం పిల్లలలో రికెట్స్ ప్రమాదాన్ని పెంచుతుంది..!