Congress New Headquarters : ఇవాళ కొత్త హెడ్ క్వార్టర్‌లోకి కాంగ్రెస్.. 24 అక్బర్ రోడ్‌లోని పాత ఆఫీసు చరిత్ర తెలుసా ?
24 అక్బర్ రోడ్‌లో ఇన్నాళ్లు నడిచిన కాంగ్రెస్ ఆఫీసుకు దాదాపు 100 సంవత్సరాల(Congress New Headquarters) చరిత్ర ఉంది.
- By Pasha Published Date - 10:58 AM, Wed - 15 January 25

Congress New Headquarters : ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభం కాబోతోంది. దీన్ని స్వయంగా సోనియాగాంధీ ప్రారంభిస్తారు. 47 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కొత్త కార్యాలయంలోకి కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ అవుతోంది. దీనికి ‘ఇందిరా భవన్’ అని పేరు పెట్టారు.
Also Read :CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
47 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..
47 ఏళ్ల క్రితం (1978 సంవత్సరంలో) కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. కొంత మంది నేతలు కలిసి వేరు కుంపటి పెట్టుకున్నారు. దీంతో తనతో ఉన్న కొంతమంది విధేయులతో కలిసి ఇందిరాగాంధీ సాహసోపేత అడుగులు వేశారు. కాంగ్రెస్(ఐ) పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉన్న టైప్ 7 రకానికి చెందిన ప్రభుత్వ బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అందులోనే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగింది. 24 అక్బర్ రోడ్‌లో ఇన్నాళ్లు నడిచిన కాంగ్రెస్ ఆఫీసుకు దాదాపు 100 సంవత్సరాల(Congress New Headquarters) చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందు దీనిలో వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సర్ రెజినాల్డ్ మాక్స్‌వెల్ నివసించారు.
1960వ దశకంలో..
1960వ దశకంలో కాంగ్రెస్ పార్టీ పాత ఆఫీసు బంగ్లాలో బర్మా దేశ రాయబారి ఉండేవారు. ఇక్కడే నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్ సాన్ సూకీ తన యుక్తవయస్సులో ఆశ్రయం పొందారు. ఆంగ్ సాన్ సూకీ తల్లి డా ఖిన్ కీ భారతదేశంలో బర్మా రాయబారిగా విధులు నిర్వర్తించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త ఆఫీసు ‘ఇందిరా భవన్’ .. ఢిల్లీలోని 9-ఏ కోట్ల రోడ్డులో ఉంది. నూతన ఆఫీసు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాత ఆఫీసు 1991, 2004, 2009 సంవత్సరాల్లో యూపీఏ కూటమి ప్రభుత్వాలకు సారథ్యం వహించింది.రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్‌లోని కొత్త కార్యాలయానికి మార్చాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే, 1991లో ఆయన ఆకస్మిక మరణంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
ప్రియాంకా గాంధీ సారథ్యంలో..
కాంగ్రెస్ పార్టీ నూతన హెడ్ క్వార్టర్ నిర్మాణం ప్రియాంకా గాంధీ సారథ్యంలో జరిగింది. కార్యాలయం మ్యాప్‌ను ఖరారు చేయడం నుంచి మొదలుకొని పెయింటింగ్, చిత్రాలు, కర్టెన్లు, ఫర్నీచర్ దాకా అన్ని అంశాలను ప్రియాంక పర్యవేక్షించారు. ఈ కొత్త కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని పాత ఆఫీసు ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నూతన కేంద్ర కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’లో చాలా వసతులు, సౌకర్యాలు ఉంటాయి. పార్టీకి పాలనాపరంగా దోహదం చేసేలా, వ్యూహాత్మక విధుల నిర్వహణకు తోడ్పడేలా ఆధునిక సౌకర్యాలను ఈ ఆఫీసులో అందుబాటులోకి తెచ్చారు.
Also Read :President Arrested : తెల్లవారుజామునే దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్.. ఎందుకో తెలుసా ?