AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
- By Latha Suma Published Date - 04:59 PM, Sat - 28 December 24

AAP: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా విచారణకు ఆదేశించారు. అయితే ఈ ఫిర్యాదు పై కేజ్రీవాల్ శనివారం స్పందించారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బీజేపీకి నేరుగా వ్యవహరించే ధైర్యం లేకపోవడంతో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌తో ఫిర్యాదు చేయించింది. ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అని మీడియాతో అన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మహిళలకు రూ.2,100, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఇప్పటికే లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీనిపట్ల బీజేపీ భయాందోళనలకు గురవుతోంది అని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు.
కాగా, ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమితో కలవకుండా ఒంటరిగానే పోటీచేస్తోంది. ఈ నేపథ్యంలనే ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య భేధాభిప్రాయాలు వస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ రాజకీయంగా ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని తొలగించేందుకు ఇతర మిత్రపక్ష పార్టీలను కలుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పడం దుమారం రేపుతోంది.