Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు
బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.
- By Pasha Published Date - 08:44 AM, Wed - 26 March 25

Saugat e Modi : పవిత్ర రంజాన్ మాసం వేళ దేశంలోని ముస్లింలకు చేరువయ్యే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇందుకోసం “సౌగత్-ఎ-మోడీ” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ముస్లింలకు ఈద్ కిట్లను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన 32 లక్షల ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్‌లను ఇవ్వాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీకి చెందిన 32వేల మంది కార్యకర్తలను రంగంలోకి దింపింది. సౌగత్ అంటే బహుమతి అని అర్థం. “సౌగత్-ఎ-మోడీ” పేరుతో బీజేపీ తయారు చేయించిన ఈద్ కిట్లను, స్థానిక మసీదుల సహకారంతో నిర్వహించే కార్యక్రమాలు వేదికగా ముస్లింలకు పంపిణీ చేస్తారు. ఇప్పటికే ఈ తరహాలో ముంబైలో, ఢిల్లీలో ఈద్ కిట్లను అందజేశారు.
Also Read :Rajiv Yuva Vikasam: రూ.50వేల యూనిట్‌పై 100 శాతం రాయితీ.. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలివీ
ముంబై, ఢిల్లీలలో షురూ
ముంబైలోని నవీ ముంబై ఏరియాలో 200 మందికి సౌగత్ ఎ మోడీ కిట్లు అందాయి. ఢిల్లీలోని బస్తీ హజ్రత్ నిజాముద్దీన్‌లో ఉన్న గాలిబ్ అకాడమీ వేదికగా ఈ కిట్లను పంపిణీ చేశారు. “సౌగత్-ఎ-మోడీ” ఈద్ కిట్లలో ఆహార పదార్థాలు, దుస్తులు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెర ఉన్నాయి. ఇందులో మహిళలకు సల్వార్-సూట్ ఫాబ్రిక్, పురుషులకు కుర్తా-పైజామా ఫాబ్రిక్ ఉన్నాయి. ఒక కిట్ ధర దాదాపు రూ. 600 ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
పంపిణీ ప్రక్రియ ఇదీ..
బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు “సౌగత్-ఎ-మోడీ”(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు. సమాజంలోని ముస్లిం వర్గంలో బీజేపీని విస్తరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్‌కు చెందిన మౌలానా సాజిద్ రషీది ప్రశంసించారు. ‘‘ఇది బీజేపీ పట్ల ముస్లింల అవగాహనను మార్చడానికి, బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
టార్గెట్ బిహార్ ఎలక్షన్స్
బిహార్‌లో ముస్లిం జనాభా ఎక్కువ. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాలు బీజేపీకి సన్నిహితుడైన సీఎం నితీశ్ కుమార్ ఇఫ్తార్ విందులను బహిష్కరించారు. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ తరుణంలో ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకే “సౌగత్-ఎ-మోడీ” కిట్ల పంపిణీని బీజేపీ మొదలుపెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ‘‘బిహార్‌లో 17 శాతం మంది ముస్లింలు ఉన్నారు. కొన్ని జిల్లాలో వారి ప్రభావం చాలా ఎక్కువ. ముస్లింల ఓట్ల కోసమే బీజేపీ సౌగత్ కిట్లను తీసుకొచ్చింది. బిహార్‌కు నిజంగా సౌగత్ (బహుమతి) ఇవ్వాలనుకుంటే తొలుత వలసలు నివారించండి. ఉద్యోగాలను కల్పించండి’’ అని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ రంజన్ విమర్శించారు. ‘‘ఇది బీజేపీ కపటబుద్ధికి నిదర్శనం. వారు చేసేదంతా మంచి, ఇతరులు చేసేదంతా చెడు అన్న రీతిలో వ్యవహరిస్తోంది’’ అని పేర్కొంటూ శివసేన (థాక్రే) యువనేత ఆదిత్య థాక్రే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.