ఎన్సీఈఆర్టీ వివాదం.. ప్రధాని మోదీ అసహనం!
వివాదాస్పద అధ్యాయం ఉన్న ఎనిమిదో తరగతి పుస్తకాల విక్రయాలను ఎన్సీఈఆర్టీ నిలిపివేసింది. అర్థరాత్రి వేళ ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌన్సిల్ తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది.
- Author : Gopichand
Date : 26-02-2026 - 6:59 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకానికి సంబంధించిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. “అసలు ఇవన్నీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు?” అని ప్రశ్నించారు. ఎనిమిదో తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి మనం ఏమి బోధిస్తున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థలో అవినీతి ఉందంటూ ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి పుస్తకంలో పొందుపరిచిన వివాదాస్పద అధ్యాయంపై సుప్రీంకోర్టు సుమోటోగా స్పందించింది. దీనిపై ఎన్సీఈఆర్టీకి కోర్టు తీవ్రస్థాయిలో మొట్టికాయలు వేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ, షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Also Read: జింబాబ్వేతో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పులు!
విచారం వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి
ఈ విషయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. “జరిగిన పరిణామం నన్ను తీవ్రంగా కలిచివేసింది. దీనికి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే సదరు పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అవి మరింత మందికి చేరకుండా చూడాలని ఎన్సీఈఆర్టీని ఆదేశించాను. ఆ పుస్తకాలను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నాము” అని తెలిపారు.
సుప్రీంకోర్టుకు ఎన్సీఈఆర్టీ క్షమాపణ
వివాదాస్పద అధ్యాయం ఉన్న ఎనిమిదో తరగతి పుస్తకాల విక్రయాలను ఎన్సీఈఆర్టీ నిలిపివేసింది. అర్థరాత్రి వేళ ఒక ప్రకటన విడుదల చేస్తూ కౌన్సిల్ తన తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పింది. పుస్తకంలో ‘జ్యుడీషియల్ కరప్షన్’ (న్యాయవ్యవస్థలో అవినీతి) అనే అధ్యాయాన్ని చేర్చడంపై విచారం వ్యక్తం చేస్తూ ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాబోవని, పిల్లలకు ఆ పుస్తకాలను చదవడానికి ఇవ్వబోమని స్పష్టం చేసింది.