Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
ముందస్తు ప్రణాళికలతో పార్టీలు గాలిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాయి. ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల, రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవడం కోసం హెలికాప్టర్లపై ఆధారపడుతున్నారు.
- By Latha Suma Published Date - 02:17 PM, Mon - 8 September 25

Bihar : బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే రాజకీయ పార్టీలు ప్రచార యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. మైదానంలోకి దిగేందుకు నాయకులు హెలికాప్టర్ల బుకింగ్‌లతో పోటీ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కోవిడ్ ప్రభావం కారణంగా గాలిమోటార్ల వినియోగం తక్కువగా ఉండగా, ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. ముందస్తు ప్రణాళికలతో పార్టీలు గాలిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాయి. ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల, రాజకీయ నాయకులు ఎక్కువ ప్రాంతాలను తక్కువ సమయంలో చేరుకోవడం కోసం హెలికాప్టర్లపై ఆధారపడుతున్నారు. ఇప్పటికే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA), ఇండియా బ్లాక్ కూటములు భారీగా హెలికాప్టర్లు బుక్ చేసుకున్నాయి. అధికారుల అంచనాల ప్రకారం రోజుకు కనీసం 20 హెలికాప్టర్లు బిహార్ గగనతలాన్ని అలంకరించనున్నాయి.
గాలిమోటార్ రాజకీయ యుద్ధం
భారతీయ జనతా పార్టీ (BJP), జనతాదల్ యునైటెడ్ (JDU) కలసి డజన్‌కి పైగా హెలికాప్టర్లు తమ ప్రచార కోసం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వాటిలో అధికభాగం బీజేపీ నేతల వినియోగంలో ఉండనుంది. ప్రత్యర్థి పార్టీలైన ఆర్జేడీ (RJD), కాంగ్రెస్ కూడా తమ స్థాయిలో హెలికాప్టర్లను బుక్ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు హెలికాప్టర్లు బుక్ చేసిందని తెలుస్తోంది. ఆర్జేడీ కూడా కొన్ని హెలికాప్టర్లను తమ ప్రచారానికి ఉపయోగించనుంది. హెలికాప్టర్ అద్దె ధరలు కూడా ఇప్పుడు రాజకీయ పార్టీలకు పెద్ద బరువే. సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌కు గంటకు ₹1 లక్ష నుంచి ₹2 లక్షల వరకు అద్దె ధర వసూలవుతోంది. డబుల్ ఇంజిన్ హెలికాప్టర్ల ఖర్చు గంటకు ₹3 లక్షల నుంచి ₹4 లక్షల వరకు ఉంది. అయితే ఎన్నికల వేడి పెరిగిన కొద్దీ ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, సింగిల్ ఇంజిన్ అద్దె 25 శాతం, డబుల్ ఇంజిన్ అద్దె 100 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందట. ప్రతి నాయకుడు రోజువారీ ప్రచార షెడ్యూల్‌ను అనుసరించి, కనీసం మూడు గంటల హెలికాప్టర్ అద్దెను ముందుగానే జీఎస్టీ సహా చెల్లించాల్సి ఉంటుంది.
లగ్జరీ ప్రచారానికి ప్రత్యామ్నాయం?
ఇక పేద ప్రజల పార్టీగా తనను చిత్రీకరించుకునే ఆర్జేడీ మాత్రం హెలికాప్టర్ ప్రచారాన్ని పరిమితంగా నిర్వహించనుంది. ఆ పార్టీ సీనియర్ నేత రాజేశ్ యాదవ్ మాట్లాడుతూ..మా అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాత జీపులోనే ప్రచారం చేయనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడమే మా లక్ష్యం. తక్కువ సమయంలో అత్యధిక నియోజకవర్గాలను కవర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే హెలికాప్టర్లు వాడతాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ మాట్లాడుతూ..మేము ప్రతి నియోజకవర్గాన్ని తలపెట్టే ఉద్దేశంతోనే ప్రచారాన్ని గాలిలో కొనసాగిస్తున్నాం. ప్రజల మధ్య చేరువవ్వాలంటే వేగమే ముఖ్యం అని అన్నారు. పట్నా ఎయిర్‌పోర్ట్ గ్లోబల్ ఫ్లైట్ సర్వీస్ మేనేజర్ దేవేంద్ర కుమార్ ప్రకారం, గత ఎన్నికలతో పోల్చితే ఈసారి హెలికాప్టర్ల డిమాండ్ రెట్టింపు అయ్యిందని తెలిపారు. ఇప్పటికే చాలా కంపెనీలు పూర్తిగా బుక్ అయిపోయాయని పేర్కొన్నారు.
ఓటర్లకూ గాలిలోనే సందేశమా?
బిహార్ రాజకీయాల్లో ప్రచార పద్ధతులు వేగంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు బహిరంగ సభలు, రోడ్ షోలు ప్రధాన ప్రచార మార్గాలైతే, ఇప్పుడు హెలికాప్టర్లతో గాలిలో సునామిలా పయనించడమే లక్ష్యంగా మారింది. ఈ మార్పు ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.