Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్‌లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
- By Latha Suma Published Date - 05:01 PM, Sat - 10 May 25

Act of War : ఉగ్రవాద చర్యలకు అంతిమంగా చెక్‌పెట్టేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంపై జరిగే ప్రతి ఉగ్రదాడిని ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం, మద్దతు ఇస్తున్న దేశాలు గట్టిగా బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్‌లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
Read Also: Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు ఇటీవల మరింత ఉద్రిక్తతకు గురవుతున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పెరిగిన ఉగ్రవాద కదలికలు, భద్రతా దళాలపై జరిగిన దాడులు భారత్‌ను మరింత అప్రమత్తం చేశాయి. వీటికి ప్రతిగా భారత్ తీసుకుంటున్న వైఖరి అంతర్జాతీయంగా కూడా గమనార్హంగా మారుతోంది. భారత భద్రతా వ్యవస్థ ఇప్పటికే అప్రమత్తంగా పనిచేస్తోందని, ఉగ్రదాడుల వెనుక ఉన్న శక్తులపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తోందని సమాచారం. ఇటువంటి చర్యలపై ఇకపైనా చలామణి విధానంతో కాకుండా, ఆర్మీ స్థాయిలో గట్టి స్పందన ఇవ్వాలని కేంద్రం సంకల్పించిందని సమాచారం.
“మన భద్రతపై దాడి యుద్ధానికే సమానం. ఎవరైనా దాన్ని ప్రోత్సహిస్తే, దాని ఫలితాలను తట్టుకోవాల్సిందే” అని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. ఉగ్రవాదులకు అండగా ఉండే దేశాలను పరోక్షంగా హెచ్చరించిన ఈ ప్రకటన, పాక్‌కు స్పష్టమైన సందేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్ మౌనంగా ఉండకూడదనే భావనతోనే ఈ గట్టి హెచ్చరిక వచ్చిందని తెలుస్తోంది. అంతేకాక, భవిష్యత్‌లో దేశ భద్రతపై విరోధ శక్తులు ఎటువంటి కుట్రలకు పాల్పడినా, దానికి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం హెచ్చరిస్తోంది.