మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !
- Author : Vamsi Chowdary Korata
Date : 04-02-2026 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
Ajit Pawar మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ ఆఖరి శ్వాస విడవడానికి కొద్ది నిమిషాల ముందు చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తోంది. ముఖ్యంగా విమాన ప్రమాదానికి కొన్ని క్షణాల ముందే.. ఆయన ఓ కార్యకర్తకు ఫోన్ చేసి మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని ముందుకు పోవాలి అంటూ చెప్పారు. ఆ ఆడియో కాల్‌ను రికార్డు చేసిన ఆయన.. ఇప్పుడు దీన్ని నెట్టింట పోస్ట్ చేసి అజిత్ పవార్‌కు ప్రజల మీద ఉన్న ప్రేమ గురించి వివరించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అజిత్ పవార్ అకాల మరణం ఆ రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత వారం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించగా.. తాజాగా ఆయన ఆఖరి నిమిషాల్లో జరిపిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చింది. మరణానికి కొద్ది నిమిషాల ముందు కూడా అజిత్ పవార్ తన రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి.. కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోవాలనే సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుత ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. అందరూ కన్నీళ్లు పెడుతున్నారు.
జనవరి 28వ తేదీన ముంబై నుంచి బారామతికి బయలుదేరిన సమయంలో అజిత్ పవార్ తన పార్టీ కార్యకర్త శ్రీజీత్ పవార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆ సంభాషణలో ఒక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం గురించి చర్చ జరిగింది. “మనం అన్ని కులాలను, మతాలను కలుపుకుని పోవాలి. జిల్లా పరిషత్‌లో మాలీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాం. అందరికీ న్యాయం చేయాలనేదే నా ప్రయత్నం” అని అజిత్ పవార్ చెప్పారు. తన చివరి శ్వాస వరకు ఆయన సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచించారని చెప్పడానికి ఈ ఆడియోనే నిదర్శనమని శ్రీజీత్ పవార్ పేర్కొన్నారు. ఈ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా ఇది కాస్తా వైరల్ కాగా.. అంతా ఆయన మాటలకు ఫిదా అయిపోతున్నారు. మిస్ యూ సర్ అటూ కామెంట్లు చేస్తున్నారు.
విమాన ప్రమాదం ఎలా జరిగిందంటే..?
జనవరి 28న ఉదయం 8 గంటలకు ముంబై నుంచి అజిత్ పవార్ ఒక ప్రైవేట్ జెట్ విమానంలో బారామతికి బయలుదేరారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే ఉదయం 8.45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా విమానం కుప్పకూలిపోయింది. ప్రతికూల వాతావరణం, తక్కువ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాద జరిగిదని ప్రాథమిక నివేదికలు చెబుతుండగా.. మరోవైపు దర్యాప్తు కొనసాగుతోంది.
అయితే ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, అటెండెంట్, ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన అజిత్ పవార్ మరణం ఎన్‌సిపికి మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటుగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన భార్య సునేత్ర పవార్ ఆ వార్తను నమ్మలేకపోయారని.. క్రాష్ సైట్ నుంచి వచ్చిన వీడియో కాల్ చూశాకే అసలు విషయం తెలిసి కుప్పకూలిపోయారని సన్నిహితులు చెబుతున్నారు.
వారసురాలిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన ఉప ముఖ్యమంత్రి పదవిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య సునేత్ర పవార్‌ను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించింది. ప్రమాదం జరిగిన కొన్ని రోజులకే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అజిత్ పవార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, ఆయన కలలుగన్న సమసమాజం కోసం కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ఆఖరి ఫోన్ కాల్లో చెప్పినట్లుగానే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.