అజిత్ పవార్ విమానంలో లేడీ పైలట్.. ఎవరీ శాంభవి పాఠక్?
- Author : Vamsi Chowdary Korata
Date : 28-01-2026 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి పాఠక్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 2016-18లో సెకండరీ స్కూల్ పూర్తయ్యాక ముంబై యూనివర్సిటీ నుంచి ఏరోనాటిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. వాణిజ్య విమానాల శిక్షణ కోసం ఆమె న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీలో చేరారు.
అనంతరం భారత్‌కు వచ్చి డీజీసీఏ నుంచి కమర్షియల్ పైలట్ లైసెన్స్‌తో పాటు ఫ్రొజెన్ ఎయిర్ లైన్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ కూడా పొందారు. అంటే, భవిష్యత్తులో పెద్ద విమానాల కెప్టెన్ కావడానికి అవసరమైన సర్టిఫికెట్ అని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్ ఫ్లయింగ్ క్లబ్లో కొత్త పైలట్లకు శిక్షణ ఇచ్చేలా అసిస్టెంట్ ప్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేశారు. ఆమె క్రమశిక్షణ, నైపుణ్యం, పని పట్ల మక్కువ కలిగి ఉంటారని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు.
2022 నుంచి ఆమె వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పూర్తిస్థాయి ఫస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీఐపీలు, బిజినెస్ ప్రముఖులు ప్రయాణించే లియర్ జెట్-45 లాంటి విమానాలను ఆమె నడుపుతున్నారు. ఈరోజు అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో పైలట్ ఇన్ కమాండ్‌గా కెప్టెన్ సుమిత్ కపూర్ ఉన్నారు. శాంభవి పాఠక్ ఫస్ట్ ఆఫీసర్‌గా పని చేశారు.