వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!
- Author : Vamsi Chowdary Korata
Date : 28-01-2026 - 5:12 IST
Published By : Hashtagu Telugu Desk
Budget 2026 భారతదేశ ఆటోమొబైల్ రంగం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అటు సామాన్యుడితో పాటు ఇటు దిగ్గజ కంపెనీలు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి స్థిరమైన పన్ను విధానం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) పట్ల స్పష్టమైన ప్రోత్సాహాన్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోరుతోంది. దేశ ఆర్థిక వృద్ధిలో 7 శాతానికి పైగా వాటా కలిగిన ఆటో రంగం ప్రగతి పథంలో సాగాలంటే ప్రభుత్వం పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
బడ్జెట్ 2026పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం 2026 బడ్జెట్‌పై గప్పెడు ఆశలు పెట్టుకుంది. GST 2.0 కింద పన్ను రేట్ల మార్పు తర్వాత ఈ రంగం దూసుకెళ్తోందని చెప్పవచ్చు. దీంతో ఈసారి బడ్జెట్ నిర్ణయాలు ఎలా ఉంటాయనే దానిపై అనేక ఊహగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొత్తగా కారు, బైక్, వ్యాన్ వంటి వెహికల్ కొనే వారికి గుడ్‌న్యూస్ ఉంటుందని భావిస్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా. అసలు ఆటోమొబైల్ రంగం 2026 బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటుంది అనే విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకనే ప్రయత్నం చేద్దాం.
Nirmala Sitharaman భారత ఆటోమొబైల్ రంగం 2025-26 ఆర్థిక ఏడాదిలోని మూడో త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్య బలమైన వృద్ధి రేటు నమోదు చేసింది. GST 2.0 కింద పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన డిమాండ్, పండుగ సీజన్ జోరు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ 2026-27పై ఉంది. ఎందుకంటే 2025లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 45.5 లక్షల యూనిట్ల మార్కును దాటి రికార్డు సృష్టించాయి. ఇందులో SUVల వాటా 55 శాతం కంటే ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం GST 2.0 అమలు. ఇది అమలులోకి వచ్చిన తర్వాత చిన్న కార్లు, టూ-వీలర్లు, కొన్ని కమర్షియల్ వెహికల్స్‌పై పన్ను భారం తగ్గింది. దీనివల్ల టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు తమ వాహనాల ధరలను 50 వేల నుంచి 2 లక్షల 40 వేల రూపాయల వరకు తగ్గించాయి. అటు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ మార్కెట్లలో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఇదిలానే కొనసాగాలంటే కచ్చితంగా బడ్జెట్ 2026లో మరిన్ని బెనిఫిట్స్ తీసుకురావాలని కోరుతున్నారు.
రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. చాలా మంది పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్వస్తి చెప్పి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈవీలకు మద్దతు ఇవ్వాలని పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఆటో పరిశ్రమ నిపుణులు కోరుతున్నారు. మెజార్టీ కాలుష్యం వాహనాల నుంచే వస్తోంది. వీటికి చెక్ పెట్టాలంటే అది ఈవీల వల్లే సాధ్యం. ప్రస్తుతం EVలపై 5 శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలపై కూడా జీఎస్టీ తగ్గించారు. నేపథ్యంలో EVలకు ఉన్న పన్ను వెసులుబాటును అలాగే కొనసాగించాలని పరిశ్రమ కోరుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఇచ్చే సబ్సిడీలను అంటే P.M ఈ-డ్రైవ్ స్కీమ్‌ను మరికొంత కాలం పొడిగించాలని కోరుతున్నారు. ఇక కంపెనీలు మాత్రం EV బ్యాటరీ విడిభాగాలు, మెగ్నెట్‌ల తయారీని దేశీయంగా పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నాయి. అలాగే బ్యాటరీ తయారీకి అవసరమైన కీలక ఖనిజాలపై దిగుమతి సుంకం మినహాయింపును కొనసాగించాలని పరిశ్రమలు భావిస్తోన్నాయి.
కొత్త పన్ను విధానంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని పెంచితే ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలి వాహనాల కొనుగోలు శక్తి పెరుగుతుందని అంచనా. మరి, దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ ఆటోమెుబైల్ పరిశ్రమ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో కీలకమైనది ముడి సరుకుల ఖర్చు. ఆటో మొబైల్ కంపెనీలకు అవసరమైన ఉక్కు, ఇతర లోహాల ధరలు పెరగడం వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఇప్పటికీ విదేశాలపై ఆధారపడటం ఒక ప్రధాన సమస్యగా ఉంది. దీనిని తగ్గించే ప్రణాళికలపై దృష్టి పెట్టాలి.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను పెంచడానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని పరిశ్రమ కోరుతోంది. ఇక బ్యాటరీ సెల్స్, సెమీకండక్టర్ల తయారీని భారత్‌లోనే చేపట్టేలా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను మరింత సరళతరం చేయాలని ఆశిస్తున్నారు. పాత వాహనాలను తుక్కుగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి ఇచ్చే రోడ్డు టాక్స్ రాయితీని పెంచాలని, తద్వారా పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇలా అనేక సవాళ్లను ఆటోమెుబైల్ రంగం ఎదుర్కొంటుంది.
గతేడాది సెప్టెంబర్ నుంచి పెట్రోల్, డీజిల్ వాహనాలపై కొంత పన్ను ఉపశమనం లభించినప్పటికీ.. 2026 బడ్జెట్ ద్వారా ఈవీ, గ్రీన్ ఎనర్జీ వాహనాల వైపు వినియోగదారులను మళ్లించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆటోమెుబైల్ రంగం గట్టిగా నమ్ముతోంది. మరి, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే బడ్జెట్.. 2030 నాటికి 30 శాతం EV వాహనాల వాటా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి.