Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!
పాక్ సైన్యం ఆగడాలు సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా పేర్కొన్నారు. "షెల్లింగ్‌లో పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి" అని దుల్లూ ఆవేదన వ్యక్తం చేశారు.
- By Latha Suma Published Date - 11:11 AM, Wed - 14 May 25

Jammu and Kashmir : పాకిస్తాన్ సైన్యం వరుసగా సరిహద్దు ప్రాంతాలపై జరుపుతున్న షెల్లింగ్ దాడుల కారణంగా తీవ్రంగా బాధపడుతున్న సరిహద్దు గ్రామాలను రక్షించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే సుమారు 9,500 రక్షణాత్మక బంకర్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అటల్ దుల్లూ వెల్లడించారు. నిన్న ఆయన రాజౌరీ జిల్లాలోని ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పాక్ దాడుల తీవ్రతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాక్ సైన్యం ఆగడాలు సామాన్య ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేశాయని, వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతగా పేర్కొన్నారు. “షెల్లింగ్‌లో పలువురు గాయపడ్డారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. పశువులు, ఇళ్లతో పాటు ప్రార్థనా మందిరాలు కూడా ధ్వంసమయ్యాయి” అని దుల్లూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : BR Gavai : సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో విచక్షణా రహితంగా దాడులు ప్రారంభించిందని, ముఖ్యంగా కుప్వారా, ఉరి, పూంఛ్ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో షెల్లింగ్ జరగిందని ఆయన తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని బంకర్లను నిర్మించేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉండి, పేలకుండా ఉన్న బాంబులు, శతఘ్ని గుండ్లను నిర్వీర్యం చేయడంలో విజయవంతమైందని చెప్పారు. అలాగే, స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు యత్నిస్తోందని తెలిపారు.
ఇకపోతే, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా టంగ్దార్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి నష్టం స్థాయిని అంచనా వేసినట్లు సమాచారం. ప్రభుత్వం నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే పరిస్థితి సాధారణ స్థితికి వస్తోంది. మూతపడ్డ విద్యాసంస్థలు, మార్కెట్లు తిరిగి తెరుచుకుంటున్నాయి. శ్రీనగర్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. మినహాయింపు మాత్రమే కుప్వారా, బారాముల్లా ప్రాంతాలకు. మిగిలిన చోట విద్యా సంస్థలు యథావిధిగా పని చేస్తున్నాయి. కశ్మీర్ విశ్వవిద్యాలయం బుధవారం నుండి తరగతులు ప్రారంభించనుంది.