Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?
- Author : Vamsi Chowdary Korata
Date : 16-06-2026 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందులో మొదటగా పిస్తా విషయానికి వస్తే..
ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిస్తాను ప్రతిరోజూ 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదట. అలాగే జీడిపప్పు తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు. అలా అని వారానికి 28 జీడిపప్పుల కంటే ఎక్కువ తినడం మంచిది కాదట. అలాగే ఎండు ద్రాక్షను ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదట. ఇందులో విటమిన్ బి, పొటాషియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చట. అలాగే వాల్ నట్స్ రోజుకి మూడు నాలుగు మించి తీసుకోకూడదట. వాల్ నట్స్ మీద ఉండే స్కిన్ ఫ్లేవర్ అంత టేస్టీగా ఉండదని చెబుతున్నారు.
కానీ 90 శాతం ఆంటీ ఆక్సిడెంట్స్, ఫెనోలిక్ యాసిడ్స్ ఈ స్కిన్‌లోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తాయట. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినడం ఆరోగ్యానికి మంచిదని, అంతకు మించి ఎక్కువగా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే ఖర్జూరం తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫ్రక్టోజ్ రిచ్‌గా ఉంటుంది, మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్‌ను నేరుగా కాకుండా నానబెట్టి తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందట.